ScienceAndTech

మరో అరుదైన ఘనత సాధించిన ఇస్రో

మరో అరుదైన ఘనత సాధించిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) (ISRO) మరో ముందడుగు వేసింది. జనవరి 1వ తేదీన పీఎస్‌ఎల్‌వీ-సీ58తోపాటు గగనతలంలోకి పంపిన ఫ్యుయల్‌ సెల్‌ను విజయవంతంగా పరీక్షించింది. అంతరిక్షంలో దాని పని తీరును విశ్లేషించడంతోపాటు డేటాను సేకరించింది. ఈ విషయాన్ని ఇస్రో ‘ఎక్స్‌’లో ప్రకటించింది. భారత అంతరిక్ష కార్యకలాపాల భవిష్యత్తు మిషన్ల కోసం దీనిని అభివృద్ధి చేశారు. పాలిమర్‌ ఎలక్ట్రోలైట్‌ మెంబ్రేన్‌ ఫ్యుయల్‌ సెల్‌గా దీనిని వ్యహరిస్తున్నారు. ఇది రసాయన చర్య జరిపి విద్యుత్తును ఉత్పత్తి చేసి.. కేవలం నీటిని మాత్రమే వదులుతుంది. హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ వాయువుల నుంచి రసాయన చర్య జరిపి 180 వాట్ల శక్తిని విడుదల చేసింది.

పీఎస్‌ఎల్‌వీ-సీ58 (PSLV-C58) విజయంతో ఈ సంవత్సరాన్ని ISRO దూకుడుగా ప్రారంభించింది. ఈ వాహకనౌకతో ‘ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం’ (XPoSat)ను కూడా పంపారు. ఇదే వాహకనౌక.. చివరి దశలో మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లి నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలో ఫ్యుయల్‌ సెల్‌ పవర్‌ సిస్టమ్‌ (FCPS) కూడా ఒకటి.

ఎక్స్‌పోశాట్‌ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇమేజింగ్‌, టైం-డొమైన్‌ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా.. ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్‌ లక్ష్యమని వివరించారు. ఇలాంటి ప్రయోగం చేయడం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తర్వాత మనమేనని వెల్లడించారు. అగ్రరాజ్యం 2021లో ఐఎక్స్‌పీఈ పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z