రామ్‌చరణ్ (Ram Charan), బుచ్చిబాబు (BuchiBabu) కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘కెప్టెన్ మిల్లర్’ ప్రమోషన్స్‌లో నటుడు శివరాజ్‌కుమార్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రామ్‌చరణ్ మూవీలో కీలక పాత్ర కోసం చిత్ర బృందం తనని సంప్రదించిందని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. శివన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తెలుగు సినిమాలో ఆయన నటిస్తుండటంపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్పోర్ట్స్ డ్రామాగా… గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్‌చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. రెహమాన్ స్వరాలు అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ పూర్తైన తర్వాత రామ్‌చరణ్ ఈ సినిమా మొదలుపెట్టనున్నారు.
‘జైలర్’లో భాగం కావడం గురించి మరో ఇంటర్వ్యూలో శివరాజ్‌కుమార్ స్పందించారు. ‘‘రజనీకాంత్ అంటే నాకెంతో గౌరవం. ఆ అభిమానంతోనే ‘జైలర్’లో యాక్ట్ చేశా. చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఎంతో కాలం నుంచి నాకు తెలుసు. ‘జైలర్’ ఆఫర్‌తో అతడు నన్ను సంప్రదించినప్పుడు తప్పకుండా యాక్ట్ చేస్తానని చెప్పా. సెట్లో రజనీకాంత్‌తో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నా. ఆ సినిమా విడుదలయ్యాక తమిళ ప్రేక్షకుల నుంచి నాకెంతో ఆదరణ లభించింది. అది చూసి నా భార్య కూడా ఆశ్చర్యపోయింది’’ అని ఆయన చెప్పారు. కోలీవుడ్ నటుడు విజయ్‌కు రాజకీయాల్లో రాణించే సత్తా ఉందని శివన్న తెలిపారు. ప్రజల్లో ఆయనకు విశేష ఆదరణ ఉందని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –