DailyDose

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కిడ్నాప్‌- నేర వార్తలు

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కిడ్నాప్‌- నేర వార్తలు

* సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కిడ్నాప్‌

రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధి(Rayadurgam)లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(Software employee) కిడ్నాప్‌(Kidnapped )స్థానికంగా కలకలం రేపింది. గురువారం సాయంత్రం కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు సైబరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయం పక్కనే ఉన్న కేర్‌ హాస్పిటల్‌ వద్ద కిడ్నాప్ చేశారు. బాధితుడి భార్యకు దుండగులు వైఫై కాల్‌ చేసి రూ.50 లక్షలు డిమాండ్‌ చేశారు. కిడ్నాప్‌కు గురైన వ్యక్తి కూకట్‌పల్లి వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* ఐఫోన్లు కొనుగోలు చేసి నగదు చెల్లించకుండా మోసం

ఐఫోన్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అబిడ్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద ఉన్న రూ.64 లక్షలు విలువ చేసే 102 ఐఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శరత్‌చంద్ర మీడియాకు వివరించారు.
‘‘అబిడ్స్ జగదీశ్‌ మార్కెట్‌లో అబ్దుల్లా అనే వ్యక్తి మొబైల్ షాప్‌ నిర్వహిస్తున్నాడు. గత ఏడాది నవంబర్ 29న ముంబయికి చెందిన విజయ్ కుమార్, నీరవ్‌రాజ్.. ఐఫోన్లు కావాలంటూ అబ్దుల్లాను సంప్రదించారు. ఫోన్లు రాగానే నగదు పంపిస్తామంటూ నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన అబ్దుల్లా మొత్తంగా 107 ఐఫోన్లను ముంబయిలో వారు చెప్పిన అడ్రస్‌కు కొరియర్‌ చేశాడు. ఫోన్లు అందిన తర్వాత వినయ్‌, నీరవ్‌రాజ్‌ డబ్బులు ఇవ్వలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన అబ్దుల్లా గత ఏడాది డిసెంబర్‌ 8న అబిడ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏ2గా ఉన్న నీరవ్‌రాజ్‌ను అరెస్టు చేశాం. 102 ఐఫోన్లను సీజ్‌ చేశాం. మరో నిందితుడు (ఏ1) విజయ్‌కుమార్‌ పరారీలో ఉన్నాడు. త్వరలోనే పట్టుకుంటాం’’ అని డీసీపీ వెల్లడించారు.

* నాగోల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ, ఎలక్ట్రిక్ స్కూటర్ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో టిప్పర్ లారీ దగ్ధమైంది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి పాపాయి గూడ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది.కుత్బుల్లాపూర్‌కు చెందిన కుతాడి కుమార్, అతని కుమారుడు ప్రదీప్ (7వ తరగతి చదువుతున్నాడు) తండ్రీ కొడుకు ఇద్దరు కలిసి ఎలక్ట్రిక్ బైక్‌పై వెళుతున్నారు. ఈ క్రమంలో పాపాయి గూడ చౌరస్తా వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బైక్ ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత టిప్పర్ లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ, ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా టిప్పర్ లారీలో మంటలు రావడంతో అక్కడే వున్న ప్రదీప్ కూడా సజీవ దహనమయ్యాడు. అతని తండ్రి కుమార్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే కుటుంబంలో తండ్రీకొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉండగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* రోడ్డుప్రమాదం ఎమ్మెల్సీకి తీవ్రగాయాలు పీఏ మృతి

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. నెల్లూరు జిల్లా కోడలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో.. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రగాయాలపాలయ్యారు.. అయితే, ఈ ప్రమాదంలో.. అక్కడిక్కడే ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పీఏ వెంకటేశ్వరరావు మృతిచెందారు.. జాతీయ రహదారి వద్ద కంటైనర్ టైర్ పగిలి సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.. వెనుక నుంచి వేగంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు వెళ్తుండగా.. కంటైనర్‌ టైర్‌ పగలడం.. సడన్‌ బ్రేక్‌ వేయడంతో.. ఆ కంటైనర్‌ను కారు వెనక నుంచి ఢీ కొట్టింది.. ఆ తర్వాత బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌రెడ్డి పీఏ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.. అయితే, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తలకు బలమైన గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆ రోడ్డులో వస్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. తన కారులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆస్పత్రిలోకి తరలించారు.. ప్రమాదాన్ని చూసి కారు ఆపిన జానీ మాస్టర్‌.. ఎమ్మెల్సీకి బలమైన గాయాలు కావడంతో.. తలకి కట్టుకట్టారు.. ఆ తర్వాత ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు క్షతగాత్రులను తన కారులో నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించి తన మంచి మనసు చాటుకున్నారు కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌.

* బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా రుద్రారంలో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గీతం యూనివర్సిటీ భవనంపై నుంచి దూకి రేణుశ్రీ అనే విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. మృతురాలు గీతం వర్సిటీలో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

* ఈడీ బృందంపై దుండగుల దాడి

సోదాల కోసం వెళ్తున్న ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)’ బృందంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. రాళ్లతో కొట్టి వారి కారు అద్దాలను ధ్వంసం చేశారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖళి ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా, ఈడీ బృందంపై దాడిని పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌ తీవ్రంగా ఖండించారు. ఇది భయంకరమైన ఘటన అన్నారు. ఈ దాడి ఆందోళనకరమైనదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అనాగరికతను, విధ్వంసాన్ని నిలువరించాల్సిన బాధ్యత నాగరిక ప్రభుత్వానిదేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన కనీస విధుల నిర్వహణలో విఫలమైతే భారత రాజ్యాంగం తనపని తాను చేస్తుందని హెచ్చరించారు.బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడానికి తన దగ్గర అన్ని రకాల రాజ్యంగపరమైన అధికారాలు ఉన్నాయని గవర్నర్‌ తన అధికారాలను గుర్తుచేశారు. ఎన్నికల ముందు జరిగే ఇలాంటి హింసాత్మక ఘటనలకు ముగింపు పలుకాల్సిన అవసరం ఉందని, ఆ ముగింపునకు ఇదే నాంది కావాలని గవర్నర్‌ ఆనందబోస్‌ వ్యాఖ్యానించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z