ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2023 ఎన్నికలు రసపట్టులో సాగుతున్నాయి. జీవితకాల సభ్యులకు/ఓటర్లకు ఈ-మెయిల్స్, పోస్టు ద్వారా ఈ-ఓటింగ్‌కు అవసరమైన పిన్ నెంబర్లు చేరుకున్నాయి. ఆన్లైన్ పద్ధతిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో వర్జీనియాకు చెందిన కృష్ణా జిల్లా ప్రవాసుడు డా.కొడాలి నరేన్, బే-ఏరియాకు చెందిన కృష్ణా జిల్లా ప్రవాసుడు వేమూరి సతీష్‌లు అధ్యక్ష అభ్యర్థులుగా తమ ప్యానెల్ సభ్యులతో కలిసి బరిలో ఉన్నారు. గతంలో మాదిరి పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో కలెక్టర్ల పుణ్యమా అని ఏయే ప్రాంతాల్లో ఎవరెవరికీ మెజార్టీ ఉందో ముందే తెలిసిపోయేది. కానీ ఈ నూతన ఆన్లైన్ ఓటింగ్ పద్ధతిలో ఆ అవకాశం లేకపోవడంతో, వేల డాలర్లు (కొందరివి సొంత డబ్బులు కాదు) ధారపోసి బరిలో నిలబడిన అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. విజయం వేమూరిదా? తానా కోట కొడాలిదా? అనే ప్రశ్నకు సమాధానం తెలియక ఎవరికి వారు అలుపెరగక ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. జనవరి 17 ఆన్లైన్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఆఖరి తేదీ. 18వ తేదీన లెక్కించి, 19న ఫలితాలు ప్రకటిస్తారు.
కొడాలి-వేమూరిలు ఇరువురు అమెరికాలో ఆంధ్రుల ఆయువుపట్టు అయిన డల్లాస్‌లో గత వారం రోజులుగా తిష్ఠ వేసి పోటాపోటీగా ప్రవాసులను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆన్లైన్లో ఓట్లు తమకు తమ ప్యానెల్‌కు వేయవల్సిందిగా కోరుతున్నారు. మరో వైపు ఇరు ప్యానెల్ అభ్యర్థులు ఉదయం 5గంటల నుండే వాట్సాప్‌లో ప్రచార సుప్రభాతాలు ప్రారంభిస్తున్నారు. SMSలు, రోబోకాల్స్తో మరో రెండు వారాల్లో ముగియనున్న ఎన్నికల్లో తమకు ఓటు వేసి విజయం చేకూర్చవల్సిందిగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చిర్రెత్తిస్తున్నారు.
గుంభన స్థితికి పరాకాష్ఠలో సాగుతున్న ఈ తానా 2023 ఆన్లైన్ ఎన్నికల్లో ఓటర్లు కూడా తెలివిగా ఏ అభ్యర్థి ఫోను చేసినా వారికే తాము ఓటు వేశామని చెప్తున్నట్లు సమాచారం. దీనితో ఇరుపక్షాలు తమ విజయం పట్ల ధీమాగా ఉన్నాయి. మరో రెండు వారాల్లో గెలిచే ఆ ఒక్కరు ఎవరో తేలిపోతుంది. అప్పటివరకు పిడికిలి బిగపట్టి కూర్చోవడం మినహా చేసేది ఏమీ లేదు!
—సుందరసుందరి(sundarasundari@aol.com)
#############
👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z