DailyDose

సున్నావడ్డీ రాయితీలో కోత!

సున్నావడ్డీ రాయితీలో కోత!

సాయం చేయకుండానే చేసినట్టు చూపించడం.. కోత పెట్టినా గాటు కనిపించకుండా చేయడం.. ఉన్న డబ్బుని మాయం చేయడం.. లేనిది ఉన్నట్టు చూపడం.. ఇవన్నీ.. ఇంద్రజాలికుల మేజిక్కులు అనుకునేరు.. కానేకాదు.. జగన్‌ సర్కారు డ్వాక్రా మహిళల విషయంలో చేస్తున్న గిమ్మిక్కులు.

మహిళా సాధికారత అంటూనే.. వారికి ఎలా టోకరా వేస్తున్నారో తెలిస్తే.. ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే!

మహిళా పక్షపాతిగా వ్యవహరించడమంటే అన్నింటా వారికి మేలు చేయడమనేగా… కానీ జగన్‌ది రివర్స్‌ పాలన కదా! అందుకే వారికి ప్రాధాన్యమివ్వకున్నా.. ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కుటుంబానికి ఆదరువుగా ఉన్న వేల మంది డ్వాక్రా మహిళల ఉపాధిని దెబ్బతీసి రోడ్డున పడేశారు. ‘సున్నా వడ్డీ’ రాయితీని రూ.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు కుదించి వారిపై భారాన్ని మోపారు. అంతేకాదండోయ్‌ వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని మహిళలు రూపాయి రూపాయి పోగేసుకున్న అభయహస్తం నిధుల్నీ లాగేసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి కోటి మందికిపైగా డ్వాక్రా మహిళలు ఉన్నారు. రెండు దశాబ్దాలుగా వీరు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటూ స్వయం ఉపాధికి ఆలంబనగా ఉన్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి వారికి ఏ ప్రభుత్వమైనా మరింత ప్రోత్సాహం అందించాలి. కానీ జగన్‌ తీరే వేరు కదా? మహిళలపై ‘అక్కచెల్లెమ్మ’లంటూ ప్రేమ కురిపించినట్టు కనిపించాలేగానీ.. భరోసా మాత్రం దక్కనివ్వరు. డ్వాక్రా మహిళలకు సంబంధించిన ‘సున్నావడ్డీ రాయితీ’ పథకంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితి రూ.10 లక్షల వరకు ఉండేది. ఆ లోపు రుణం ఎంత తీసుకున్నా రూ.5లక్షల వరకు సున్నావడ్డీ రాయితీ వర్తించేది. జగన్‌ అధికారంలో రాగానే ఈ వడ్డీ రాయితీని రూ.3 లక్షలకు తగ్గించారు. అంటే రూ.2 లక్షల రుణానికి రాయితీ వర్తించనట్టే. డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణానికి ఇది కలిసి వారిపై వడ్డీ భారం అధికమవుతోంది. వడ్డీ ఎందుకు పెరుగుతుందో.. అర్థంకాక డ్వాక్రా మహిళలు తలలు పట్టుకుంటున్నారు. దీని గురించి ఏమీ మాట్లాడకుండా ఠంచనుగా సున్నావడ్డీ రాయితీకి బటన్‌ నొక్కుతున్నట్టు చెబుతారు.

రాయితీ తగ్గించడమా..
2021 వరకు డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి పొందే గరిష్ఠ రుణ పరిమితి రూ.10 లక్షలుగా ఉండేది. ఆ తర్వాత కేంద్రం ఈ నిబంధనను సడలించి ఎలాంటి తనఖా లేకుండా రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచింది. డ్వాక్రా సంఘాలపై బ్యాంకులకు ఉండే నమ్మకంతో రుణాల్ని అందిస్తున్నాయి. చాలా సంఘాలు రూ.10-15 లక్షల వరకు రుణాన్ని పొందుతున్నాయి. వారిపై వడ్డీ భారం పడకుండా చేయాలనే ఆలోచన జగన్‌కు ఉంటే గత ప్రభుత్వం సున్నా వడ్డీ అమలు చేసిన రూ.5 లక్షలకంటే ఎక్కువగా పెంచి రూ.7 లక్షలకో రూ.10 లక్షలకో వర్తింపచేయాలి. పెంచడం సంగతి అటుంచితే ఇప్పటికే ఒక వైపు రూ.2 లక్షలకు రాయితీ కోత పడగా.. రుణ పరిమితి పెరగడం కారణంగా ఆ మేర వడ్డీ భారమూ పెరిగింది. పైగా తాను వేసిన కోత సంగతి చెప్పకుండా.. బ్యాంకులతో మాట్లాడి వారు తీసుకునే వడ్డీ శాతాన్ని తగ్గించామని ఇటీవల ఆయన కొత్త పల్లవి అందుకున్నారు.

రూ.2,100 కోట్ల బకాయిలూ ఎగవేత…
డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణానికి రాయితీని వర్తింప చేసే పథకం 10 ఏళ్లకుపైగానే అమల్లో ఉంది. మొదట్లో దీన్ని పావలా వడ్డీగా అమలు చేయగా.. ఆ తర్వాత సున్నావడ్డీగా మార్చారు. 2014లో తెదేపా అధికారం చేపట్టిన నుంచి రూ.5 లక్షల వరకు తీసుకున్న రుణాలకు సున్నా వడ్డీని వర్తింపచేశారు. ఈ రాయితీని ఏటా విడుదల చేయకపోయినా నిధుల లభ్యతకు అనుగుణంగా అయిదేళ్లలో(2014-19) రూ.2,835 కోట్ల మేర సభ్యులకు అందించారు. రూ.2,100 కోట్లు బకాయిలుండగా ప్రభుత్వం మారింది. ఆ బకాయిల్ని చెల్లించాల్సిన బాధ్యత తర్వాత ప్రభుత్వానిదే కదా? కానీ, జగన్‌ సర్కారు రూ.2,100 కోట్లు చెల్లించకుండా ఎగవేసింది. గత ప్రభుత్వంలోనే ఆ పథకం రద్దయినట్లు మాట్లాడిన ఆయన.. 30 ఏళ్ల క్రితం నుంచి వివిధ ప్రభుత్వాలు గృహ నిర్మాణాలకు పేదలకు రుణమిచ్చి… కట్టించుకోకుండా వదిలేసిన మొత్తాన్ని ఓటీఎస్‌ పేరుతో డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల్లోంచి బలవంతంగా కట్టించుకున్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?

‘మిత్ర’లే శత్రువులయ్యారా..
చిరుద్యోగాలతో సాధికారత దిశగా అడుగులు వేస్తున్న డ్వాక్రా మహిళలపై పగబట్టినట్టు వారి ఉద్యోగాలన్నీ తొలగించారు జగన్‌. వీరికి ఎన్నికల ముందు ‘అధికారంలోకి రాగానే గొప్ప మేలు చేస్తాన’ని హామీ కూడా ఇచ్చారు. కల్యాణమిత్ర, బీమామిత్ర, పశుమిత్రలుగా పనిచేస్తున్న 7,500 మంది మహిళల్ని సీఎం పీఠం ఎక్కగానే నిర్ధాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించారు. వారంతా నెలకు రూ.10-20 వేల వరకు సంపాదించేవారు. ఇది జగన్‌ గత నాలుగున్నరేళ్లలో సాధించిన మహిళా సాధికారత.

‘ఉన్నతి’పైనా శీతకన్నే..
డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వాలు ‘ఉన్నతి’ పథకాన్ని అమలు చేశాయి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం దీనికి రూ.800 కోట్లు వడ్డీ లేకుండా రుణంగా ఇచ్చి.. నెలవారీ వాయిదాల్లో తిరిగి కట్టించుకునేది. స్వయం ఉపాధిని కల్పించి చేయూతను అందించింది. గొప్ప మహిళా సాధికారత సాధకునిగా ప్రగల్భాలు పలికే జగన్‌.. ఈ నాలుగున్నరేళ్లలో ఉన్నతికి ఒక్క రూపాయీ కేటాయించలేదు. పథకాన్ని నిలిపేయలేక.. గత ప్రభుత్వాలు ఇచ్చిన మొత్తాన్నే రొటేషన్‌ చేసుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు.

అభయహస్తంలో.. హ్యాండ్‌ ఇచ్చారు

డ్వాక్రా సంఘాల్లోని 18-59 ఏళ్లు నిండిన వారికి 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛను ఇచ్చేందుకు 2009లో అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చారు. దీనికి గాను అర్హత గల మహిళలు ఏటా ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నారు. పింఛను చెల్లించేందుకు ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకున్నారు. దరఖాస్తుదారుల వాటా, ప్రభుత్వం వాటా కలిపి రూ.2 వేల కోట్ల వరకు చేరింది. అప్పుల అప్పారావ్‌.. జగన్‌కు దానిపై కన్ను పడింది. ఎల్‌ఐసీ సంస్థను ఆ పథకం నుంచి తప్పించి ఆ మొత్తాన్ని తీసేసుకున్నారు.

డ్వాక్రా మహిళలపై రూ.49 వేల కోట్ల అప్పు…

తెదేపా పాలనలో డ్వాక్రా సంఘాలపై రూ.27 వేల కోట్లు అప్పులున్నాయని, ఆ సంఘాలను కుదేలు చేశారని 2019 ఎన్నికల ముందు జగన్‌ ప్రచారం చేశారు. ప్రస్తుతం జగన్‌ హయాంలో వారిపై అక్షరాలా రూ.49 వేల కోట్ల అప్పు ఉంది. కానీ ఇప్పుడు డ్వాక్రా సంఘాలు అద్భుతంగా ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికంటే తెదేపా ప్రభుత్వంలో వారికి మంచి ప్రోత్సాహం ఉండేది. దీంతో సంఘాలపై నమ్మకం పెరిగి బ్యాంకులు ఇచ్చే రుణాన్ని కూడా క్రమంగా పెంచాయి. ఆ ప్రకారమే అప్పట్లో డ్వాక్రా సంఘాలపై ఉండే అప్పూ పెరిగింది. కానీ డ్వాక్రా సంఘాలు కుదేలయ్యాయని అసత్య ప్రచారం చేశారు జగన్‌. ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తూ మహిళల్ని ఇంకా మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z