సూర్యుడి (Sun)ని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్1 (Aditya-L1) తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శనివారం చేపట్టిన కీలక విన్యాసం ఫలించింది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి దీన్ని పంపించారు. ఇక్కడి నుంచి ఇది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రధాని మోదీ ఎక్స్‌లో వెల్లడించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
‘‘భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. దేశ తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 తన గమ్యస్థానాన్ని చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ అద్భుత విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు. మానవాళి ప్రయోజనాల కోసం శాస్త్రసాంకేతిక రంగంలో కొత్త శిఖరాలకు చేరుకునే మన ప్రయాణం కొనసాగుతుంది’’ అని మోదీ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
అటు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ కూడా దీనిపై పోస్ట్ చేశారు. ‘‘మూన్ వాక్ నుంచి సన్ డ్యాన్స్ వరకు..! ఆదిత్య-ఎల్1 తుది కక్ష్యలోకి చేరుకుంది. ఇస్రోకు అభినందనలు’’ అని ఆయన పోస్ట్‌లో వెల్లడించారు.
సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ‘ఆదిత్య-ఎల్1’ లక్ష్యం. భారత్ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. గతేడాది సెప్టెంబరు 2న శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి.
👉 – Please join our whatsapp channel here –