ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైకాపాకు (YSRCP) మరో గట్టి షాక్ తగిలింది. పార్టీని వీడుతున్నట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా’’ అని తెలిపారు. ఇటీవలే సీఎం జగన్ సమక్షంలో అంబటి రాయుడు వైకాపాలో చేరిన విషయం తెలిసిందే. మరో వికెట్ పడటంతో అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
గుంటూరు ఎంపీ టికెట్ కేటాయిస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైకాపాలో చేరారు. అయితే, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుని గుంటూరు స్థానానికి మారాల్సిందిగా శుక్రవారం జగన్ ప్రతిపాదించారు. ఆ స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి ఏమాత్రం అంగీకరించని శ్రీకృష్ణదేవరాయలు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గుంటూరు స్థానాన్ని ఆశించిన రాయుడు.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది.
👉 – Please join our whatsapp channel here –