తమ డిమాండ్లను పరిష్కారించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మెను నిషేధిస్తున్నట్లు అందులో పేర్కొంది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జీవో నెంబర్ 2 విడుదల చేసింది. దీని ప్రకారం ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. దాదాపు రూ.3వేలు తగ్గించి.. రూ.8,050 వేతనాన్ని వారి ఖాతాల్లో జమచేసింది.
అసలేమిటీ ‘ఎస్మా’?
‘ఎస్మా’ అనేది ‘ఎసెన్సియల్ సర్వీసెస్ మెయిన్‌టీనెన్స్ యాక్ట్’కు సంక్షిప్త రూపం. ఇది సమ్మెలు, హర్తాళ్లు వంటి సందర్భాల్లో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా.. కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981లో రూపొందించిన చట్టమిది. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే.. జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది.
ఎందుకొచ్చిందీ చట్టం?
1980లలో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికి పోయింది. ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉద్ధృత స్థాయిలో ఉద్యమించాయి. 1981లో కార్మిక సంఘాలు పార్లమెంట్ ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె కూడా చేయాలని పిలుపునిచ్చారు. క్రమంగా ఈ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. తొలుత 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ‘ఎస్మా’ ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలో ‘ఎస్మా’ చట్టం తీసుకొచ్చింది.
ఎస్మాను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది?
ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపైనైనా బలమైన అనుమానం ఉంటే.. నేరశిక్షాస్మృతి(సీపీసీ)తో సంబంధం లేకుండానే.. పోలీసు అధికారులు వారెంట్ లేకుండానే అరెస్టు చేయొచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలూ చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్నవారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారూ శిక్షార్హులే!
👉 – Please join our whatsapp channel here –