కొత్త ఏడాదిలో తిరుమల దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ(IRCTC) అందిస్తోన్న ఈ ప్యాకేజీ మీకోసమే. విశ్రాంతి సదుపాయాలతో పాటు, ప్రత్యేక దర్శన టికెట్లు ఇందులో లభిస్తాయి. తిరుమలతో పాటు తిరుచానూరు ఆలయాన్ని కూడా సందర్శించుకోవచ్చు.
ఈ యాత్ర రెండు రాత్రులు, మూడు పగళ్లు కొనసాగుతుంది. విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట, తెనాలి స్టేషన్లలో రైలు ఎక్కొచ్చు. ప్రతి శుక్రవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది.
ప్రయాణం ఇలా..
కాకినాడ టౌన్ నుంచి బయల్దేరే శేషాద్రి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం- 17210) రాత్రి 10:50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
రెండో రోజు ఉదయం 5:10 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అక్కడ ముందుగా బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అల్పాహారం అనంతరం తిరుమలకు బయల్దేరుతారు. ప్రత్యేక దర్శనం టికెట్లతో స్వామి వారిని దర్శించుకోవచ్చు. శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం అనంతరం తిరుచానూరుకు పయనమవుతారు. అక్కడ పద్మావతీ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. రెండో రోజు రాత్రి 10:30 గంటలకు రైలు (తిరుమల ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నం.17487)లో తిరుగు ప్రయాణం ఉంటుంది. మూడోరోజు ఆయా స్టేషన్లు చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.
ఇవి గుర్తుంచుకోండి..
తిరుమల వెళ్లి రావడానికి రైలు టికెట్లు (3 ఏసీ, స్లీపర్ ఎంపికను బట్టి) ప్యాకేజీలో అంతర్భాగం.
ఏసీ గదిలో బస, ఏసీ రవాణా సదుపాయం.
తిరుమల, తిరుచానూరు ఆలయాల దర్శన టికెట్లు ప్యాకేజీలో భాగమే.
పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే భక్తులే చెల్లించాలి.
ఒక రోజు అల్పాహారం మాత్రమే ఐఆర్‌సీటీసీ చూసుకుంటుంది.
టూర్ గైడ్, ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది.
తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.
ప్యాకేజీ వివరాలు.. (ఒకరికి)
స్టాండర్డ్‌లో (స్లీపర్ బెర్త్), రూమ్ సింగిల్ షేరింగ్ అయితే రూ.4,690, ట్విన్, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.3,560. 5-11 ఏళ్ల చిన్నారులకు విత్ బెడ్, విత్ అవుట్ బెడ్‌కు రూ.2,650 చెల్లించాలి.
కంఫర్ట్‌లో (థర్డ్ ఏసీ బెర్త్) సింగిల్ షేరింగ్‌కు రూ.5,850, ట్విన్, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.4,720 చెల్లించాలి. 5-11 ఏళ్ల చిన్నారులకు విత్ బెడ్, విత్ అవుట్ బెడ్‌కు రూ.3,810 చెల్లించాలి.
ఏదైనా కారణం చేత 15 రోజుల ముందు ప్రయాణం రద్దు చేసుకుంటే ఒక్కో టికెట్‌కు క్యాన్సిలేషన్ కింద రూ.250 మినహాయించి మిగతా మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. అదే 8 – 14 రోజుల ముందు రద్దు చేసుకుంటే 25 శాతం, 4 – 7 రోజుల ముందు రద్దు చేసుకుంటే 50 శాతం టికెట్ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి నాలుగు రోజుల కంటే తక్కువ సమయంలో రద్దు చేసుకొంటే తిరిగి చెల్లింపులు ఉండవు.
👉 – Please join our whatsapp channel here –