శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన భారాస… వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్యనేత, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఈ అంశంపై చర్చ జరిగినపుడు కేటీఆర్ అంత సానుకూలత చూపలేదు.. అలా అని వ్యతిరేకించలేదు. కేసీఆర్ తీసుకొనే తుది నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుంది’ అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేటీఆర్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. దీనివల్ల జాతీయ స్థాయిలో భారాసకు ప్రాధాన్యం వస్తుందని భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిదృష్ట్యా లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం చాలా ముఖ్యమని భారాస భావిస్తోంది.
ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది. నియోజకవర్గాల వారీగా ముఖ్యనాయకుల సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం ప్రారంభించింది. 2018 శాసనసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన భారాస తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 9 భారాస గెలుపొందింది. 4 భాజపా, 3 కాంగ్రెస్, హైదరాబాద్ లోక్‌సభ ఎంఐఎం దక్కించుకున్నాయి. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో భారాస 7 లోక్‌సభ స్థానాల పరిధిలోనే ఆధిక్యం సాధించింది. ఇందులో మూడింటిలో ఆధిక్యం స్వల్పంగా ఉంది. 4 చోట్ల మాత్రమే ఎక్కువ ఆధిక్యాలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దృష్ట్యా స్వల్ప ఆధిక్యాలు వచ్చిన లోక్‌సభ స్థానాలను దక్కించుకోవడానికి మరింత శ్రమపడాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపికకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పార్లమెంటులో కూడా క్రియాశీలంగా ఉండే నాయకుల అవసరం ఉందని భావించి కేటీఆర్‌ను ఎంపీ ఎన్నికల బరిలోకి దింపాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను భారాస గెలుచుకొంది. దీని పరిధిలో భారాసకు 9.38 లక్షల ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 5.83 లక్షలు, భాజపాకు 4.25 లక్షలు వచ్చాయి.
సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 భారాస, ఒకటి ఎంఐఎం దక్కించుకొంది. భారాసకు 4.63 లక్షలు, కాంగ్రెస్‌కు 2.8 లక్షలు, భాజపాకు 2.16 లక్షల ఓట్లు వచ్చాయి. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి కేటీఆర్ పోటీ చేయవచ్చని తెలుస్తున్నా మల్కాజిగిరికే ఎక్కువ అవకాశాలున్నాయని సమాచారం.
కరీంనగర్ స్థానం నుంచి మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పోటీ చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని పరిధిలో కాంగ్రెస్ కంటే భారాసకు కేవలం 5వేల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. ఈ స్థానం నుంచి భాజపా ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో కలిపి ఆ పార్టీకి 2.5 లక్షల ఓట్లు వచ్చాయి. ఇక్కడి అసెంబ్లీ స్థానాల్లో నాలుగింటిని కాంగ్రెస్ గెలుచుకొంది. ఇది భాజపా సిటింగ్ స్థానం కావడంతో ఇక్కడ త్రిముఖపోరు ఖాయం. ‘‘కేటీఆర్ మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే అంశంపై చర్చ జరిగింది, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని భారాసకు చెందిన ముఖ్యనాయకుడొకరు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –