DailyDose

స్టాఫ్‌నర్స్‌ పోస్టుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌పై అభ్యంతరాలు

స్టాఫ్‌నర్స్‌ పోస్టుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌పై అభ్యంతరాలు

స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీలో భాగంగా ప్రాథమిక మెరిట్‌ లిస్ట్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వారి అభ్యంతరాలను స్వీకరించి నివృత్తి చేయాలని రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఆదేశించింది. స్టాఫ్‌ నర్స్‌ అభ్యర్థుల అభ్యంతరాలు నివృత్తి చేయాలని అధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. జనవరి 15వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని టీఎస్‌ హెల్త్ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఆదేశించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన సందేహాలను ఈ నెల 17వ తేదీలోగా నివృత్తి చేయాలని చెప్పారు. ఈ క్రమంలో ఎవరైనా అర్హులుగా తేలితే వారిని సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు అనుమతించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే బోర్డు కూడా ప్రెస్‌ నోటు విడుదల చేసింది. స్టాఫ్‌నర్స్‌ అభ్యర్థులు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.

తెలంగాణలో 9 విభాగాల్లో 7,094 స్టాఫ్‌నర్స్‌ ఖాళీల భర్తీకి గతేడాదిలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఎమ్‌హెచ్‌ఎస్‌ఆర్బీ) పరీక్ష నిర్వహించింది. గతేడాది డిసెంబర్‌ 28వ తేదీన మెరిట్‌ జాబితాను విడుదల చేసింది. బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీ ప్రాంగణంలో డిసెంబర్‌ 30న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ మొదలైంది. ఈ పోస్టులకు సుమారు 40 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారందరి మారులతో మెరిట్‌ జాబితాను విడుదల చేశారు. మార్కుల ఆధారంగా విడుదలైన ఈ జాబితా ఏకంగా 1,419 పేజీలు ఉన్నది. ఇందులో తమ పేరును వెతుకోవడంతోపాటు ఆ జోన్‌ పరిధిలో ఏ క్యాటగిరీ వారికి అత్యధికంగా ఎన్ని మారులు వచ్చాయన్న వివరాలను తెలుసుకోవడం అభ్యర్థులకు సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ని గందరగోళాల మధ్య ఎట్టకేలకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా స్పందించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z