* రెండు కీలకమైన కేసులను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు
సైబర్ నేరాలకు సంబంధించిన రెండు కీలకమైన కేసులను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. డఫాబెట్ వెబ్‌సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని దిల్లీలో అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిందితుడిని హరియాణాకు చెందిన హితేశ్ గోయల్‌గా గుర్తించారు. అతడి నుంచి రూ.1.40 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. యూనిటీ స్టాక్స్ పేరుతో మోసాలు చేస్తున్న వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. రూ.3.16 కోట్లు నష్టపోయినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. నిందితుడిని రోనక్‌తన్నాగా గుర్తించినట్లు చెప్పారు. ఇతడు దుబాయ్ నుంచి మోసాలకు పాల్పడేవాడని, నిందితుడి బ్యాంక్ ఖాతాలోని రూ.20 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. అతడికి సహకరించిన మరో ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశామన్నారు. నిందితుడు 95 బ్యాంక్ ఖాతాలు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
* వసతి గృహంలో పలువురు బాలికలు అదృశ్యం
అక్రమంగా నిర్వహిస్తోన్న వసతి గృహం (shelter home) నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాజధాని భోపాల్(Bhopal) శివారులో ఉన్న ఈ వసతి గృహంలో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ ఛైర్మన్ ప్రియాంక్ కనుంగో ఆకస్మిక పర్యటన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పర్వాలియా ప్రాంతంలో ఉన్న ఆంచల్ బాలికల వసతి గృహంలో గుజరాత్, ఝార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. తన ఆకస్మిక పర్యటనలో ప్రియాంక్.. రిజిస్టర్‌ను పరిశీలించారు. మొత్తం 68 మంది బాలికలు ఉండాలి. కానీ అక్కడున్న అమ్మాయిల్లో 26 మంది తక్కువగా ఉన్నారు. వసతి గృహం డైరెక్టర్‌ను ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. దాంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. షెల్టర్ హోం నిర్వహణలో ఎన్నో లోపాలు ఉన్నాయని, అక్రమంగా నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. ఆశ్రయం పొందుతున్న బాలికల వయసు ఆరు నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటుందని ప్రియాంక్ తెలిపారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట పురుష సిబ్బంది కూడా కాపలా ఉంటున్నారని గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి కమిషన్ నోటీసులు పంపింది. ఈ అదృశ్యాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు.
* ట్రాఫిక్ ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు
వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన హన్మకొండ ట్రాఫిక్ ఎస్సై డేవిడ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం రాత్రి ములుగు రోడ్డు వద్ద ట్రాఫిక్ ఎస్సై డేవిడ్ ఓ వాహనదారుడి నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెంటనే ఆయనను హెడ్ క్వార్టర్స్‌కు తరలించి, విచారణ చేపట్టారు. ట్రాఫిక్ ఎస్సై లంచం తీసుకున్నట్లు నిరూపణ కావడంతో సీపీ అంబర్ కిశోర్‌ఝా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మొదటి నుంచీ డేవిడ్ పనితీరుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి.
* పోలీస్‌పై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే
విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారిపై ఎమ్మెల్యే చేయి చేసుకోవడం వివాదాస్పదం అయింది. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. పూణేలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై బీజేపీ ఎమ్యెల్యే చేయి చేసుకున్నారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఈ రోజు తెలిపారు. పూణే కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు సునీల్ కాంబ్లే పూణేలోని సాసూన్ జనరల్ హాస్పిటల్‌లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను కొట్టిన సంఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
* స్పా సెంటర్లపై పోలీసులు దాడులు
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారంతో సౌత్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, గుడిమల్కాపుర్ పోలీసులు రెండు చోట్ల సోదాలు నిర్వహించారు. ఐదుగురు యువతులతోపాటు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అనుమతి లేని స్పా సెంటర్లు ఎక్కడున్నా ఆ భవన యజమానులు తెలుసుకొని నిర్వాహకులను ఖాళీ చేయించాలని, లేదంటే వారిపైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గుడిమల్కాపుర్ ఇన్‌స్పెక్టర్ ముజీబ్ రెహ్మాన్ హెచ్చరించారు.
* కిడ్నాపైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్షేమం
హైదరాబాద్ రాయదుర్గంలో కిడ్నాపైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురేందర్ క్షేమంగా ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర అతడిని పోలీసులు కాపాడారు. కిడ్నాప్ చేసి బంధించి కారులో తరలిస్తుండగా ఆత్మకూరు (మం) భైర్లుటీ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అంతకుముందు.. కిడ్నాపర్లు వ్యక్తి బంధువుల నుంచి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా.. ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుంచి సురేంద్రను రక్షించారు పోలీసులు. రాయదుర్గం నుంచి కిడ్నాపర్లు కారులో నల్లమల అడవులకు తీసుకెళ్తుండగా.. పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. తన భర్తను వదిలిపెట్టాలంటే రూ. 2 కోట్లు ఇవ్వాలని సురేందర్ భార్యకు ఫోన్ చేసి బెదిరించారు. పోలీసులకు సమాచారం తెలియడంతో బాధితుడిని వదలి కిడ్నాపర్లు పరారయ్యారు. వారి కోసం నల్లమలలో పోలీసులు గాలిస్తున్నారు.
* భార్యపై హత్యాయత్నం చేసిన భర్త
భార్యపై హత్యాయత్నం చేసిన భర్తపై సిరిసిల్లలో కేసు నమోదైంది. సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరుకు చెందిన దండబోయిన సౌజన్యకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం విఠల్‌నగర్‌కు చెందిన దండబోయిన శ్రీకాంత్‌తో గతేడాది వివాహం జరిగింది. పెళ్లి జరిగిన పదిహేను రోజునుంచి రూ.5లక్షలు అదనపు ఇవ్వాలని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. లేకుంటే చంపుతానని బెదిరించారు. ఈ క్రమంలో కిరోసిన్ పోసే ప్రయత్నం చేశాడని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, శ్రీకాంత్‌ను రిమాండ్ చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.