Business

నచ్చిన ధరకే ‘Uber’ క్యాబ్

నచ్చిన ధరకే ‘Uber’ క్యాబ్

క్యాబ్‌ బుక్‌ చేసే సమయంలో ప్రయాణ దూరం, సమయం బట్టి ఛార్జీలు ఉండటం మనం గమనిస్తుంటాం. ఒక్కోసారి తక్కువ దూరానికీ ఎక్కువ ధర చూపిస్తుంటుంది. అలాంటి సమయంలో ఛార్జి తగ్గించాలని బేరమాడే సదుపాయం ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఆన్‌లైన్‌లో సాధారణంగా అలాంటి సౌకర్యం ఉండదు. రైడ్‌ బుక్‌ చేసుకున్న సమయంలో చూపించే మొత్తమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాబ్‌ సర్వీసులు అందించే ఉబర్‌ (Uber) కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. యూజర్‌ ఎంత ధర పెట్టాలనుకుంటున్నాడో అంతకే క్యాబ్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

‘ఉబర్‌ ఫ్లెక్స్‌’ (Uber Flex) పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. రైడ్ బుక్‌ చేసుకున్నప్పుడు సాధారణంగా కనిపించే ధరలకు బదులుగా తొమ్మిది విభిన్న ధర ఎంపికలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి మాత్రం డీఫాల్ట్‌గా ఉంటుంది. ఇక రైడ్‌ బుక్‌ చేసుకున్న వ్యక్తి ఈ తొమ్మిదింట్లో తనకు నచ్చిన ధరను ఎంచుకోవచ్చు. రైడర్‌ ఎంచుకున్న ధర డ్రైవర్‌కి నచ్చితే తన ప్రతిపాదనను అంగీకరిస్తాడు. లేదా తిరస్కరించవచ్చు. ఇలా నచ్చిన ధరతో రైడ్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఇకపై డ్రైవర్లకు, కస్టమర్లకు రైడ్‌ ధరను ఎంచుకొనే విషయంలో స్వేచ్ఛ ఉండనుందన్నమాట.

ఉబర్‌ కస్టమర్లు తమ రైడ్‌ ధరల ఎంపికపై నియంత్రణ కల్పించటం కోసం ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తక్కువ ధరకే రైడర్లు ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. ప్రయాణించిన తర్వాత నగదు లేదా డిజిటల్ పద్ధతి ద్వారా చెల్లింపులు చేయొచ్చు. గతేడాది అక్టోబరులోనే ఫ్లెక్స్‌ ఫీచర్‌ టెస్టింగ్‌ను ఉబర్‌ ప్రారంభించింది. ఔరంగాబాద్‌, ఆజ్మీర్‌, బరేలీ, చండీగఢ్‌, కోయంబత్తూర్‌, దేహ్రాదూన్‌, గ్వాలియర్‌, ఇందౌర్‌, జోధ్‌పుర్‌, సూరత్‌ ప్రాంతాల్లో పరీక్షించినట్లు ఉబర్‌ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో దిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో ఈ సేవల్ని పరీక్షించనుంది. భారత్‌తో పాటు లెబనాన్‌, కెన్యా, లాటిన్‌ అమెరికా వంటి దేశాల్లో ఈ ఫీచర్‌ని పరీక్షిస్తోంది.

సేఫ్టీ టూల్‌ కిట్‌..
ఇటీవల ఉబర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకున్న ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ‘ఫోన్‌లో వీడియో చూస్తూ డ్రైవర్‌ వాహనం నడుపుతున్నాడు. ఇది భయం కలిగిస్తోంది’ అంటూ తనకెదురైన అనుభవాన్ని ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. దీనిపై ఉబర్‌ స్పందించింది. ఇలాంటి సమయాల్లో మీరు సేఫ్టీ టూల్‌కిట్‌ ఆప్షన్‌ని ఎంచుకోవాలని, అప్పుడు తమ ప్రత్యేక భద్రతా బృందం సంప్రదించి మీకు సాయపడుతుందని సూచించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z