Politics

అంబటి రాయుడు రాజీనామా కలకలం

అంబటి రాయుడు రాజీనామా కలకలం

అధికార వైకాపా (YSRCP)కు మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు (Ambati Rayudu) రాజీనామా కలకలం రేపిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఆడకుండానే అవుటయ్యారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అంబటి రాయుడు ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా వివరణ ఇచ్చారు. ‘‘జనవరి 20 నుంచి దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాను. వృత్తిపరమైన క్రికెట్‌ ఆడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరముంది’’ అని పేర్కొన్నారు.

పార్టీలో చేరిన పది రోజులకే గుడ్‌బై
అంతర్జాతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన తెలుగు బిడ్డ అంబటి రాయుడిని వైకాపా పెద్దలు నమ్మించి మెల్లగా తమ పార్టీ వైపు తిప్పుకొన్నారు. క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించగానే ఆయన్ను ముఖ్యమంత్రి జగన్‌ పిలిపించుకుని మాట్లాడారు. ప్రస్తుత గుంటూరు జిల్లాకు తన వంతు ఏదైనా చేయాలన్న రాయుడి ఆలోచనలను పంచుకుని రాజకీయ గాలం వేశారు.

ముందు గుంటూరు లోక్‌సభ (ప్రస్తుతం గుంటూరు జిల్లా మొత్తం) పరిధిలో తిరగాలని, అవగాహన వచ్చాక రాజకీయ ఉన్నతికి సహకరిస్తామని పార్టీ పెద్దలు నమ్మబలికారు. అప్పటినుంచి ఆర్నెళ్లపాటు రాయుడు జిల్లా అంతటా వ్యయప్రయాసలకోర్చి తిరిగారు. కాలక్రమంలో.. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ గత నెలలో గుంటూరులోనే సీఎం ప్రారంభించిన కార్యక్రమానికి స్వతహాగా క్రీడాకారుడైన, పార్టీ పురోగతికి శ్రమిస్తున్న రాయుడికి ఆహ్వానం అందలేదు. అయినా ఆయన సర్దుకుపోయారు. గత నెల 28న ముఖ్యమంత్రే స్వయంగా కండువా కప్పి వైకాపాలో ఆయన్ను చేర్చుకున్నారు. అంతటితోనే ఆగలేదు.. గుంటూరు లోక్‌సభ స్థానం మీదేనని, అక్కడినుంచి పోటీ చేయండని చెప్పారు. ముఖ్యమంత్రి హామీ లభించడంతో పోటీకి సంబంధించి రాయుడు సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ.. శుక్రవారం నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఆయన్ను ఈసారి గుంటూరు లోక్‌సభ స్థానానికి మారాలని సూచించారు. ఆయన ససేమిరా అనడంతో ఆలోచించుకుని రావాలని సీఎం పంపించారు.

‘గుంటూరు లోక్‌సభ టికెట్‌ నాదేనని నమ్మబలికి పార్టీలో చేర్చుకుని.. ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు సీఎం ఎందుకు ప్రయత్నిస్తున్నారు? నాకు టికెట్‌ ఇవ్వాలనే ఆలోచనే లేకపోతే ఇస్తామని చెప్పడమెందుకు? పార్టీలో చేర్చుకోవడమెందుకు? నమ్మించి ఇలా గొంతు కోస్తారా?’ అని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. ఈ నమ్మకద్రోహం నుంచి కోలుకోలేక రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. బ్యాట్‌ పట్టకముందే అవుటయ్యారు. ‘వైకాపా నుంచి క్విట్‌ చేయాలని నిర్ణయించుకున్నా.. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా..తదుపరి కార్యాచరణను రాబోయే రోజుల్లో వెల్లడిస్తా’నని సామాజిక మాధ్యమంలో అభిప్రాయాన్ని వెల్లడించారు. తదుపరి కార్యాచరణను రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని పేర్కొన్నారు. స్పష్టత కోసం ఆయన ప్రయత్నించగా.. వైకాపా పెద్దల నుంచి సరైన స్పందన రాలేదని తెలిసింది. వైకాపాలో చేరి పట్టుమని పది రోజులు అవకుండానే రాయుడు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z