Business

డిసెంబర్ త్రైమాసికానికి IT సేవల కంపెనీల విశ్లేషకుల అంచనాలు

డిసెంబర్ త్రైమాసికానికి IT సేవల కంపెనీల విశ్లేషకుల అంచనాలు

దేశీయ ఐటీ సేవల కంపెనీలు, డిసెంబరు త్రైమాసిక గణాంకాల్లో స్తబ్దత ప్రదర్శించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా, ఐరోపాల్లో దాదాపు అన్ని రంగాల ఖాతాదార్లు ఐటీ సేవల కోసం బడ్జెట్ల కేటాయింపుపై ఆచితూచి వ్యవహరిస్తుండటం, ప్రాజెక్టులు ఆలస్యమవుతుండటంతో.. ఊహించని విధంగా బెంచ్‌పై కూర్చున్న ఐటీ నిపుణుల సంఖ్య పెరగడం, ఉద్యోగులకు వేతనాల పెంపు వల్ల పడిన భారం ఇందుకు కారణమని చెబుతున్నారు.

ఫలితాల వెల్లడి 11 నుంచి
టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ ఈనెల 11న, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 12న, ఎల్‌అండ్‌టీ మైండ్‌ట్రీ 16న, టెక్‌ మహీంద్రా 24న, సైయెంట్‌ 25న మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి.

కొన్ని త్రైమాసికాలుగా..
మన ఐటీ కంపెనీల సేవలకు కీలక మార్కెట్లయిన పాశ్చాత్య దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితుల వల్ల బలహీనతలు ఏర్పడ్డాయి. అందువల్ల కొన్ని త్రైమాసికాలుగా ఐటీ రంగం ఇబ్బంది పడుతోంది. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), టెక్నాలజీ సేవల రంగాల్లో సెంటిమెంటు పటిష్ఠంగా లేదు. ఫలితంగా కొత్త ప్రాజెక్టులు లేక బెంచ్‌పై కూర్చుంటున్న నిపుణుల సంఖ్య పెరుగుతోంది. నూతన నియామకాలు తగ్గుతున్నాయి. కళాశాలల ప్రాంగణాల్లో ఎంపికలు జరిపి ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా.. వారిని ఆఫీసులకు రమ్మని పిలవడం ఆలస్యమవుతోంది. ఈ అంశాలన్నీ దేశీయ ఐటీ కంపెనీల అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక ఆదాయాలపై ప్రభావం చూపొచ్చు. అగ్రశ్రేణి (టైర్‌-1), మధ్యస్థాయి (టైర్‌-2) ఐటీ కంపెనీల ఆదాయాల వృద్ధి, మార్జిన్లపైనా ప్రభావం పడొచ్చని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగుల నియామకాలు పెరుగుతున్నా, వడ్డీరేట్లు తగ్గకపోవడం అనిశ్చితికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి త్రైమాసికం వారీగా 0.7 శాతం, ఏడాది వారీగా 2.5 శాతంగా నమోదు కావొచ్చన్నది సంస్థల అంచనా.

రూపాయి మద్దతు..
మూడో త్రైమాసికం (క్యూ3)లో డాలర్‌తో పోలిస్తే, రూపాయి బలహీన పడటం ఐటీ కంపెనీలకు కొంత కలిసి రావచ్చు. డాలర్ల రూపేణ ఆదాయం ఏడాది వారీగా చూస్తే పెద్దగా మార్పు లేకపోయినా, రూపాయల్లో చూస్తే మెరుగ్గా ఉండొచ్చు. త్రైమాసికం వారీగా టైర్‌ 1 ఐటీ కంపెనీల వృద్ధి -2.6% నుంచి 5%, టైర్‌ 2 సంస్థలకు 1-3% ఉండొచ్చని భావిస్తున్నారు. టైర్‌1, టైర్‌2 కంపెనీల ఆదాయ వృద్ధిలో అంతరం మాత్రం తగ్గొచ్చు. మూడో త్రైమాసికంలో భారీ ప్రాజెక్టుల ప్రకటనలూ తక్కువగా ఉండటం గమనార్హం.

టైర్‌-1 కంపెనీలకే మొగ్గు
టైర్‌-2 కంపెనీలతో పోలిస్తే టైర్‌-1 కంపెనీలకే బ్రోకరేజీలు మద్దతు తెలుపుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోతీలాల్‌ పేర్కొంది. టైర్‌-2లో సైయెంట్‌ను పరిశీలించొచ్చంటోంది. ఆర్డరు పుస్తకం బలంగా ఉన్నా.. ఐటీ కంపెనీల పనితీరు క్యూ3లో స్తబ్దుగానే ఉండొచ్చని మరొక బ్రోకరేజీ సంస్థ ఛాయిస్‌ ఈక్విటీ చెబుతోంది.

స్వల్పకాలంలో ఊగిసలాటలు
సీజను పరంగానూ మూడో త్రైమాసికంలో ఐటీ సేవలకు గిరాకీ తక్కువగా ఉండడమూ.. ఆదాయ స్తబ్దతకు దారితీయొచ్చని అరిహంత్‌ క్యాపిటల్‌ అంటోంది. టైర్‌-1 కంపెనీల్లో టీసీఎస్‌; టైర్‌-2 కంపెనీల్లో కోఫోర్జ్‌, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, రూట్‌ మొబైల్‌ను పరిశీలించొచ్చని అంటోంది. ఇటీవలి కాలంలో ఈ రంగ షేర్లలో ర్యాలీ కనిపించిన నేపథ్యంలో స్వల్పకాలంలో మాత్రం ఊగిసలాటలు కనిపించొచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంటోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z