Movies

‘అన్నపూరణి’ సినిమాపై ఫిర్యాదు

‘అన్నపూరణి’ సినిమాపై ఫిర్యాదు

లేడి సూపర్‌స్టార్‌ నయనతార నటించిన చిత్రం ‘అన్నపూరణి’ ఓటీటీలో దూసుకుపోతున్నది. డిసెంబర్‌లో విడుదల చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా ఈ చిత్రం.. ఓటీటీలో మాత్రం అభిమానులను ఆకట్టుకున్నది. ప్రస్తుతం ఓటీటీలో నెంబర్‌వన్‌గా నిలిచి టెండ్రింగ్‌లో నిలిచింది. అయితే, ఈ చిత్సం వివాదంలో చిక్కుకున్నది. ‘అన్నపూరణి’ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చిత్రం లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. ఈ మేరకు సినిమా నిర్మాతలతో పాటు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఇండియాపై కఠిన చర్యలు తీసుకోవాలి పోలీసులతోపాటు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ట్విట్టర్‌ ద్వారా కోరారు.

‘ప్రపంచమంతా శ్రీరాముడి మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ హిందూ వ్యతిరేక చిత్రం అన్నపూరణి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. దీన్ని జీ స్టూడియోస్‌, నాడ్‌ స్టూడియోస్‌, ట్రైడెంట్‌ నిర్మించాయి. హిందూ పూజారి కూతురు బిర్యానీ వండే సమయంలో నమాజ్‌ చేస్తుంది. ఈ సినిమాలో లవ్‌ జిహాద్‌ ప్రచారం జరిగింది. రాముడే మాంసం తిన్నాడంటూ చిత్రంలో ఫర్హాన్‌ (నటుడు) నటిని మాంసం తినమని ప్రేరేపించాడు. చిత్రంలో నటి తండ్రి ఆలయ పూజారి.. అతను విష్ణువుకు నైవేద్యాలు పెడతాడు. చిత్రంతో పూజారి కూతురు మాంసం వండడం, ముస్లింతో ప్రేమలోపడడం, రంజాన్‌ ఇఫ్తార్‌కు వెళ్లడం, నమాజ్‌ వెళ్లడం వంటివి చిత్రంలో ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఇండియా, జీ స్టూడియోస్ ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ చిత్రాన్ని రూపొందించి విడుదల చేశాయి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ఈ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను ముంబయి పోలీసులు, ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను’ అని రమేశ్‌ సోలంకి పేర్కొన్నారు. అన్నపూరణి చిత్ర దర్శకుడు నీలేశ్‌ కృష్ణ, నయనతార, నిర్మాతలు జతిన్ సేథి, ఆర్ రవీంద్రన్, పునీత్ గోయెంకా, జీ స్టూడియో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ షరీక్ పటేల్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా హెడ్ మోనికాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అయితే, ఇప్పటి వరకు మేకర్స్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ మాత్రం స్పందించలేదు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z