Devotional

అయోధ్య ప్రారంభోత్సవ వేళ ‘హను-మాన్‌’ చిత్రబృందం కీలక నిర్ణయం

అయోధ్య ప్రారంభోత్సవ వేళ ‘హను-మాన్‌’ చిత్రబృందం కీలక నిర్ణయం

అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని, జనవరి 22న కుటుంబసభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని చెప్పారు. మరోవైపు, రామమందిర ప్రారంభోత్సవ వేళ ‘హను-మాన్‌’ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కీలక పాత్రలో నటించిన చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రతి టికెట్‌పై రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుంది. చిత్రబృందం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చిరంజీవి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘హను-మాన్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు (HanuMan Pre Release Event) ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు.

‘‘ఈ ఈవెంట్‌కు రావడానికి కొన్ని కారణాలున్నాయి. నా ఆరాధ్య దైవం, అమ్మానాన్నల తర్వాత అనుక్షణం ప్రార్థించే వ్యక్తి ఆంజనేయస్వామి. ఆయనను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తీసిన సినిమా ఇది. డైపర్లు వేసుకునే స్థాయి నుంచి డయాస్‌లు ఎక్కే స్టేజ్‌కు వచ్చిన తేజ సజ్జా మరో కారణం. ట్రైలర్‌, టీజర్‌ చూసినప్పుడు ప్రతి సన్నివేశంలో ఫైన్‌నెస్‌ కనిపించింది. తొలిసారి ‘ఎవరీ డైరెక్టర్‌’ అని అడిగి మరీ తెలుసుకున్నా. నేను కొలిచే హనుమంతుడి గురించి బయట ఎక్కడా చెప్పుకోలేదు. ఆయనను పూజిస్తూ క్రమశిక్షణతో, నిబద్ధతతో ఈస్థాయికి వచ్చాను. ఇలాంటి వేదికపై హనుమాన్‌ గురించి కచ్చితంగా చెప్పాలి. అందుకే ఈ ఈవెంట్‌కు రమ్మని కోరగానే మరో ఆలోచన లేకుండా వచ్చేశా. హనుమంతుడు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. మా ఇంట్లో భక్తులెవరూ లేరు. మా నాన్న కమ్యూనిస్ట్‌. అమ్మ కోరిక మేరకు ఎప్పుడైనా తిరుపతి వెళ్లేవారు. అలాంటిది నేను ఏడో తరగతి చదువుతుండగా, పొన్నూరులో ఆంజనేయస్వామి గుడికి వెళ్లి నమస్కారం చేసుకుని వచ్చేవాడిని.

ఒకసారి లాటరీలోనూ ఆ స్వామి ఫొటో వచ్చింది. దాన్ని ఇప్పటికీ ఫ్రేమ్‌ కట్టి పూజిస్తున్నా. హనుమాన్‌ను పూజించడం వల్ల నాన్న కోరుకున్న చోటుకి ట్రాన్స్‌ఫర్‌ అవడంతో ఆయన కూడా భక్తుడిగా మారిపోయారు. భగవంతుడు బాహ్యంగా ఉండడు. మన అంతరాత్మలో ఉంటాడు. హనుమాన్‌ మనకు ఆశీస్సులు అందిస్తే జీవితాంతం వదలడు. మనల్ని నిరంతరం కాపాడుతూ, మార్గ నిర్దేశం చేస్తుంటాడు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ప్రశాంత్‌వర్మ ఆలోచనలు, హీరో తేజ కష్టం వృథాపోవు. ‘హను-మాన్‌’ మూవీ గురించి గెటప్‌ శ్రీను మొదటిసారి నాకు చెప్పాడు. ఇది పరీక్షాకాలం. వరుస సినిమాలు ఉన్నప్పుడు ఎక్కువ థియేటర్‌లు దొరకకపోవచ్చు. ఇవాళ కాకపోతే రేపు చూస్తారు. ఫస్ట్‌ షో కాకపోతే, సెకండ్‌ షో చూస్తారు. కంటెంట్‌ బాగుంటే, ప్రేక్షకుల మార్కులు పడతాయి. చిత్ర బృందం అధైర్యపడొద్దు. విజయం మీదే. అయోధ్య రామమందిరానికి మీరు చేస్తున్న సాయం అభినందనీయం’’ అని చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు.

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ.. ‘సినిమా అనేది ఒక యుద్ధం.. అవకాశం రావడం, మూవీ తీయడం ఒకెత్తయితే, చివరిగా రిలీజ్‌ చేయడం ఇంకా పెద్ద యుద్ధం. ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కరి వెనుక హనుమంతుడు ఉంటాడు అని మా సినిమాలో ఒక డైలాగ్‌ ఉంది. అలా మా సినిమాకు అలా అండగా నిలబడిన వారు చిరంజీవి. మేము అడగ్గానే ఈ ఈవెంట్‌కు వచ్చిన ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత నిరంజన్‌రెడ్డి, వినయ్‌ రాయ్‌ వరలక్ష్మీ శరత్‌కుమార్‌, అమృత అయ్యర్‌, గెటప్‌ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z