మెట్రోరైలు రెండోదశ కొత్త మార్గాల ప్రతిపాదనలపై ఆదివారం మేధోమథనం జరిగింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైలు లిమిటెడ్(హెచ్‌ఎఎంఎల్) ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ నిపుణులు, మెట్రో సీనియర్ అధికారులతో మెట్రోరైలు భవన్‌లో విస్తృతంగా చర్చించారు. ప్రతిపాదిత కొత్త మార్గాల్లో సవాళ్లు, సంక్షిష్టతలు, సాధ్యమయ్యే సాంకేతిక పరిష్కారాలపై సమాలోచనలు జరిపారు.
మార్గంపై స్పష్టత కోసం..
నాగోల్-ఎల్బీనగర్- మైలార్‌దేవ్‌పల్లి- శంషాబాద్ విమానాశ్రయం వరకు ఒక మార్గం ప్రతిపాదన ఉంది. నాగోల్-ఎల్బీనగర్-మైలార్‌దేవ్‌పల్లి-ఆరాంఘర్- కొత్త హైకోర్టు అనుసంధానంగా మరో మార్గం ఉంది. ఇందులో ఏ మార్గాన్ని ఎంపిక చేయాలి, ఎలా చేయాలనే దానిపై నిపుణులతో చర్చించారు.
ఫలన్‌నుమా నుంచి 1.5 కి.మీ.పొడిగింపు..
ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు మరో 1.5 కి.మీ. పొడిగిస్తే విమానాశ్రయ మెట్రోకి అనుసంధానం అవుతుంది. చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ వస్తుంది. ఇక్కడ ఇరుకైన రహదారి, ఫ్లైఓవర్ ఉండటంతో మెట్రోరైలు రివర్సల్, స్టేబ్లింగ్ లైన్ల ఏర్పాటులో ఉన్న సంక్షిష్టతలు, సాధ్యమయ్యే సాంకేతికత పరిష్కారాలపై ప్రధానంగా చర్చించారు.
డిపోలు ఎక్కడ?
మెట్రోరైలు రెండోదశ కోసం కొత్త డిపోలు, ఆపరేషన్ కంట్రోల్ సెంటర్స్ (ఓసీసీ) ఏర్పాటు చేసే ప్రదేశాలు, నిర్మాణ వ్యయం తగ్గించేందుకు సీఎం సూచించినట్లుగా మైలార్‌దేవ్‌పల్లి నుంచి విమానాశ్రయం వరకు భూమార్గం మీదుగా మెట్రో నిర్మాణం సాధ్యాసాధ్యాలకు పరిష్కారాలపై సమాచాలోచనలు చేశారు.
ఒక కారిడార్ నుంచి మరో కారిడార్‌కు మారేందుకు ఇబ్బందిలేకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాల్సిన అవసరాన్ని సమావేశంలో గుర్తించారు. డీపీఆర్ రూపకల్పన సమయంలో ఇవన్నీ నిపుణులతో చర్చించాలని నిర్ణయించారు.
దేశంలోని వేర్వేరు మెట్రోల్లో అనుసరిస్తున్న ఉత్తమమైన పద్ధతులను సీనియర్ ఇంజినీర్లు, కన్సల్టెంట్లు అధ్యయనం చేయాలని ఎన్వీఎస్‌రెడ్డి ఆదేశించారు. కొత్త మెట్రో స్టేషన్లలో తగిన పార్కింగ్ సౌకర్యాల కల్పన, బస్సులు, ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం కల్పించే లాస్ట్‌మైల్ కనెక్టివిటీ, విమానాశ్రయ మెట్రోరైళ్లలో లగేజీ కోసం ఖాళీ స్థలం తదితర వాటిని డీపీఆర్ సిద్ధం చేసేటప్పుడు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సమావేశంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, చీఫ్ సిగ్నల్, టెలికాం ఇంజినీర్ ఎస్.కె.దాస్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్‌మోహన్, జనరల్ మేనేజర్లు ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, బి.ఎన్.రాజేశ్వర్, కన్సల్టెన్సీ సంస్థకు చెందిన మెట్రోరైలు నిపుణులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –