* కేసీఆర్‌ను పరామర్శించిన నరసింహన్ దంపతులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ నంది నగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం కేసీఆర్ బాత్రూంలో జారిపడడంతో ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ నేపథ్యంలో, మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇవాళ సతీసమేతంగా కేసీఆర్ నివాసానికి వచ్చారు. క్రమంగా కోలుకుంటున్న కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా ఆరోగ్యవంతులు కావాలంటూ ఆకాంక్షించారు. కాగా, కేసీఆర్ నివాసానికి వచ్చిన నరసింహన్ దంపతులకు కేటీఆర్ స్వాగతం పలికారు.
* పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే పొత్తులపై ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు. ఇప్పటికీ జనసేనతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ చెప్పగా.. తాజాగా పొత్తులపై కాంగ్రెస్ పార్టీ కూడా నోరువిప్పింది.మత విద్వేషం ప్రదర్శించే బీజేపీతో రాజీలేని పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు. బీజేపీ భాగస్వాములు అయిన టీడీపీ, జనసేనపైనా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీతో వైసీపీ అనైతిక బంధంలో ఉందని ఆరోపించారు. ఈ నాలుగు పార్టీలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాడుతుందని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల తర్వాత ఏపీలోనూ అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. షర్మిల రాకతో పార్టీ ఏపీలో పుంజుకుంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ ఒక క్లారిటీ ఇవ్వడం విశేషం.
* టీడీపీకి దూరం జరిగిన కేశినేని నాని
విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీతో కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ తనను వద్దనుకుంటున్నప్పుడు తాను కూడా పార్టీతో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రా కదలిరా సభ నిర్వహించగా, ఈ సభకు కేశినేని దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విజయవాడలో కేశినేని నాని కార్యాలయం వద్ద టీడీపీ జెండాలు తొలగించేశారు. పసుపు జెండాలు లేని కేశినేని నాని ఆఫీసు బోసిపోయినట్టుగా దర్శనమిస్తోంది.
* వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఘాటు విమర్శలు
టీడీపీ తిరువూరులో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగించిన తీరు అందరిలో ఆసక్తిని.. అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా లోని వైసీపీ ఎమ్మెల్యేలపై పేరుపేరునా విమర్శల జల్లు కురిపించారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. కానీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాత్రం ఎలాంటి విమర్శలు చెయ్యలేదు. ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యేని వదలకుండ విమర్శించిన ఆయన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను మాత్రం ఎందుకు స్కిప్ చేశారు..? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.అసలే వైసీపీలో మార్పులు చేర్పుల కార్యక్రమం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడిన అచ్చన్నాయుడు కూడా వైసీపీ లోని హేమాహేమీలు కూడా పార్టీని వీడనున్నారని. వాళ్లంతా టీడీపీని సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కూడా వాళ్ళను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వసంత కృష్ణప్రసాద్ ను ఒక్క మాట కూడా అనలేదు. దీనితో వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారనున్నారా..? టీడీపీ అతన్ని ఆహ్వానించిందా? అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి.
* 30 రోజుల కాంగ్రెస్ పాలనపై భట్టి ట్వీట్
తెలంగాణ ప్రజల కలలను నిజం చేయడంతో పాటు వారికిచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని.. అప్పుల ఊబి నుంచి గట్టెక్కించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. ఈ మేరకు 30 రోజుల కాంగ్రెస్ పాలనపై ఆయన ట్వీట్ చేశారు.‘‘రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ వాటిని అధిగమించి.. సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. విభజన హామీల అమలు కోసం కేంద్రానికి విన్నవిస్తాం. ఎలాంటి భేషజాలకు పోకుండా పాలన కొనసాగిస్తాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఇప్పుడు పాలన, అభివృద్ధే ముఖ్యం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం సమష్టి బాధ్యత. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ నా కోసమే ఏర్పాటు చేశారని.. పౌరులు అనుకునే విధంగా మా పరిపాలన సాగుతుంది’’ అని తెలిపారు.
* పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్లారిటీ
పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే ఉన్నానని.. నెల్లూరు ఎంపీగా పోటీచేస్తున్నా అని తెలిపారు. ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. సీఎం జగన్ ఏం చెబితే తాము అది చేస్తామని మంత్రి కాకాణి అన్నారు. వైసీపీపై దుష్ప్రచారం చేయడమే టీడీపీ లక్ష్యమని విమర్శించారు. తమ పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని.. ఎవరూ పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు.
* నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఉత్తమ్‌కుమార్ సమీక్ష
నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదలపై సమీక్షించారు. సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులను చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌ను తుమ్మల కోరారు.
👉 – Please join our whatsapp channel here –