Politics

బీఆర్ఎస్ పార్టీ ఆ ఎన్నికలపై ఫోకస్

బీఆర్ఎస్ పార్టీ ఆ ఎన్నికలపై ఫోకస్

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఓటమి తరువాత సైలెంట్ అయిన బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు.. ఇప్పుడిప్పుడే సౌండ్ పెంచుతున్నారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీ ఆ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. తుంటిగాయం కారణంగా గులాబీ దళపతి కేసీఆర్ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుండగా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు అన్నీ తామై పార్టీని నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ సీట్ల కేటాయింపు అంశంపై కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం చేయబోమంటూ ఆయన చేసిన వ్యా్ఖ్యలు ఇప్పుడు పొలిటికల్‌గా, ముఖ్యంగా బీఆర్ఎస్‌ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఐదారుగురు మినహా మిగతా సిట్టింగ్స్ అందరికీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు గులాబీ బాస్ కేసీఆర్. అందరూ గెలుస్తారనే ధీమాతో ఎన్నికల కథనరంగంలోకి దూకారు. కానీ, ఫలితాలు రివర్స్ అయ్యాయి. అధికారం కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఆ ఎన్నికలపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కీలక కామెంట్స్ చేశారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచి ఉండేవాళ్లమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తప్పు చేయబోమని స్పష్టం చేశారు కేటీఆర్.

ఆంతర్యం ఇదే..

అంటే.. దీని ప్రకారం.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్‌లకు ఫిట్టింగ్ పెట్టినట్లేనని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చకపోవడం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చాలా మంది ఇప్పటికే విశ్లేషించారు. ఇదే కారణాన్ని ఇప్పుడు కేటీఆర్ ప్రస్తావించడం.. మార్పు అనివార్యం అని చెప్పకనే చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కామెంట్స్ ప్రకారం.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్ కేటాయించే అవకాశం ఉండకపోవచ్చని స్పష్టమవుతోంది.

అదే జరిగితే కథ కంచికే..!

తెలంగాణ శాసనసభ ఎన్నిక్లలో ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీ.. బతికిబట్టకట్టాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో తన బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలి. లేదంటే.. పార్టీ మనుగడే కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేపో మాపో ఆ పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో.. రాజకీయ పరిస్థితులన్నింటీని విశ్లేషించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అభ్యర్థుల మార్పు అంశంపై కామెంట్స్ చేసినట్లు స్పష్టమవుతోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z