వైకాపా సర్కారు పాపాలు.. పాఠశాల విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పాఠశాలల్లో గంజాయి, మద్యం, అసాంఘిక కార్యకలాపాలతో విద్యార్థి దశలోనే పిల్లల బంగారు భవిష్యత్తు నాశనమవుతోందన్నారు. ప్రజలారా కలిసి రండి.. మహమ్మారిపై యుద్ధం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు లోకేశ్ ఓ వీడియో విడుదల చేశారు.
‘‘వైకాపా పాలనలో బడి, గుడిలోకి గంజాయి వచ్చేసింది. విద్యార్థులు మద్యం మత్తులో బడికొస్తున్నారు. సీఎం జగన్ ఇంటి ఎదురుగా గంజాయికి బానిసైన పిల్లాడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తే.. ఆమెని పోలీసులు బెదిరించి నోరు మూయించారు. సీఎం ఇంటికి సమీపంలో డ్రగ్స్ మత్తులో గ్యాంగ్ రేప్ జరిగితే నేటికీ నిందితుడిని పట్టుకోలేదు. అక్కడే మద్యం మత్తులో ఓ ఉన్మాది.. అంధురాలిని హత్యచేస్తే చర్యల్లేవు. గంజాయి, మద్యం, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాల నుంచి పిల్లల్ని కాపాడే వరకూ పోరాడుతూనే ఉంటా. చంద్రగిరిలో 9వ తరగతి అమ్మాయి గంజాయికి బానిసైంది. చోడవరంలో ఏడో తరగతి విద్యార్థులు స్కూలులో మద్యం తాగారు. వీడియో తీసిన వ్యక్తిపై వారు దాడికి పాల్పడ్డారు. దండుపాళ్యం వైకాపా సర్కారుకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఈ మహమ్మారిపై ప్రతిపక్షంగా ఉంటూనే రాజీలేని పోరాటం సాగిస్తున్నాం. తెదేపా-జనసేన ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మనమంతా కలిసి యుద్ధం చేద్దాం. మన పిల్లల్ని కాపాడుకుందాం’’ అని పిలుపునిచ్చారు.
👉 – Please join our whatsapp channel here –