త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా, ఇందుకు టీచర్ల పదోన్నతుల అంశం అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. టీచర్ల పదోన్నతులకు, మెగా డీఎస్సీకి మధ్య పెద్ద లింకు ఉన్నది. ఉపాధ్యాయ పదోన్నతులు కల్పిస్తే దాదాపు 8,000 టీచర్ పోస్టులు అందుబాటులోకి వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఉపాధ్యాయ నియామకాలతోపాటు, వారికి పదోన్నతులు కల్పించాలంటే విద్యాహక్కు చట్టం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం ఆయా అభ్యర్థులు టెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందాలంటే టెట్ పేపర్-2లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. పదోన్నతులకు టెట్ తప్పనిసరి కావడంతో 2015 లోపు టీచర్లంతా ఉత్తీర్ణులు కావాలని కేంద్రం గడువు విధించింది. ఆ తర్వాత మరో ఐదేండ్లు పొడిగించింది. అప్పట్లో విద్యాశాఖ కొత్త రిక్రూట్‌మెంట్లకే టెట్‌ను అమలుచేసింది. పదోన్నతులు కల్పించే పరిస్థితులు, అర్హులు లేకపోవడంతో టీచర్లు సైతం దీనిని అంత సీరియస్‌గా తీసుకోలేదు. గత డిసెంబర్‌లో టెట్‌తో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ భావించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కొంతమంది టీచర్లు టెట్ ఉన్న వారికే పదోన్నతులు కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎస్‌ఏ, జీహెచ్‌ఎం పదోన్నతులకు బ్రేకులుపడ్డాయి.
మేలో టెట్?
మెగా డీఎస్సీ, టీచర్ల పదోన్నతుల నేపథ్యంలో మేలో టెట్‌ను నిర్వహించాలని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. టీచర్లకు ప్రత్యేకంగా టెట్‌ను నిర్వహించాలన్న డిమాండ్లు ఉపాధ్యాయ సంఘాల నుంచి వినిపిస్తున్నా ఇది సాధ్యంకాదని విద్యాశాఖ స్పష్టంచేసింది. టెట్‌ను నిర్వహిస్తాం కానీ ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులతో పాటే టీచర్లు కూడా టెట్ రాసుకోవాలని చెప్తున్నది. ఇప్పుడు టెట్ నిర్వహిస్తే క్వాలిఫై కావడం అంత సులభంకాదని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన టెట్ పేపర్-2లో 15.30 శాతమే క్వాలిఫై అయ్యారు. 2022లో 49.64%, 2017లో 19.51%, 2016లో 25.04% టీచర్లు మాత్రమే క్వాలిఫై అయ్యారు. దీంతో పదోన్నతులపై ఆశలు పెట్టుకున్న టీచర్లకు టెట్ బెంగపట్టుకున్నది. పదోన్నతులపై హైకోర్టు ఎలాంటి స్టే విధించలేదని, టెట్ అర్హత గల వారికి పదోన్నతులు కల్పించాలని టెట్ క్వాలిపైడ్ టీచర్స్ ఫోరం నేత పరశురాం ప్రభుత్వాన్ని కోరారు.
వాస్తవ పరిస్థితులిలా..
రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఒక టీచర్ 1987లో స్కూల్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరగా, ఇప్పటికీ అదే పోస్టులో కొనసాగుతున్నారు. . సీనియార్టీ ప్రకారం జీ
హెచ్‌ఎం పదోన్నతికి అవకాశం ఉన్నప్పటికీ, టెట్ లేకపోవడంతో ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
మంచిర్యాల జిల్లా దేవాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో పనిచేస్తున్న టీచర్ 1998 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్)గా నియమితులయ్యారు. గెజిటెడ్ హెచ్‌ఎం పదోన్నతి పొందాలన్న ఆశతో 2011 టెట్‌కు హాజరై క్వాలిఫై అయ్యారు. నిబంధనల ప్రకారం ఆయనకు పదోన్నతి కల్పించాల్సి ఉన్నది. కానీ, సీనియర్లను పక్కకుతోసి పదోన్నతి కల్పిస్తే వారు అంగీకరించే పరిస్థితి లేదు. ఇలాంటి వారి వ్యవహారాల్లో కోర్టు వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నది.
👉 – Please join our whatsapp channel here –