తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జుల మార్పు కసరత్తుపై చర్చలు కొనసాగుతున్నాయి. సీఎంవో పిలుపుతో పలువురు నేతలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. నందికొట్కూరు నియోజకవర్గ ఇంఛార్జి మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత ఇంఛార్జి బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఇంఛార్జి మార్పుపై కసరత్తు చేస్తుంది అధిష్టానం. మరోవైపు.. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను బైరెడ్డి కలిశారు. నందికొట్కూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నందికొట్కూరుకు కొత్త అభ్యర్థి ఎంపికపై సీఎం చర్చిస్తోన్నారు.
ఇదిలా ఉంటే.. మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జి నియామకం పై కూడా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, మార్కాపురం జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డిలకు పిలుపు వచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇరువురితో హైకమాండ్ చర్చిస్తోంది. మరోవైపు.. విజయనగరం పార్లమెంట్ ఇంఛార్జి నియామకంపై కూడా కసరత్తు చేస్తున్నారు. సీఎంఓ పిలుపుతో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అనంతరం సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. అంతేకాకుండా.. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ ఇంఛార్జి నియామకంపై సీఎం కసరత్తు చేస్తున్నారు. డోన్ ఎమ్మెల్యే, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సీఎంవోకి పిలిపించారు సీఎం.
మరోవైపు.. పలువురు ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. కాసేపట్లో సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని రానున్నారు. ఇప్పటికీ.. క్యాంపు కార్యాలయానికి వచ్చినవారిలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. వీరితో పాటు రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ చంద్రశేఖర్, ఎంపీ మార్గాని భరత్ లకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో వారు క్యాంపు ఆఫీసుకు రానున్నారు.
👉 – Please join our whatsapp channel here –