ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ (Vyuham Movie ) సినిమా విడుదలపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ సినిమాపై చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వేసిన పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు రికార్డ్స్ ను కోర్టుకు సెన్సార్ బోర్డు సమర్పించింది. అయితే సెన్సార్ బోర్డు ఇచ్చిన రికార్డులను చూసిన అనంతరం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
వాస్తవానికి గత ఏడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సినిమాపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమా రాజకీయంగా తమను కించపరిచే విధంగా, తమ ప్రతిష్టతకు భంగం కలిగించే విధంగా ఉందంటూ నారా లోకేష్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్ ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం గత బుధవారం విచారణ చేపట్టింది. సినిమా సకాలంలో విడుదల కాకపోవడం వల్ల కోట్లల్లో నష్టం వచ్చిందని నిర్మాత తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్‌లోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు స్పష్టం చేయడంతో సినిమా విడుదలపై ప్రతిష్టంభన కొనసాగుతుంది.
👉 – Please join our whatsapp channel here –