Politics

నంద్యాల జిల్లా ప్రజల ఉత్సాహం చూస్తే ?

నంద్యాల జిల్లా ప్రజల ఉత్సాహం చూస్తే ?

నంద్యాల జిల్లా ప్రజల ఉత్సాహం చూస్తోంటే.. వైకాపా పతనం ఖాయమనిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతోందన్నారు. మంగళవారం ఆళ్లగడ్డలో నిర్వహించిన ‘రా.. కదలిరా..’ బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

‘‘నంద్యాల జిల్లా ప్రజలకు కొత్త ఏడాది, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ జిల్లాలోని అన్ని స్థానాల్లో తెదేపా గెలవబోతోంది. ఐదేళ్ల వైకాపా పాలనలో యువత నిరుద్యోగులుగా మారారు. ఎక్కడ చూసినా విధ్వంసక పాలన. రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలి. రాతి యుగం వైపు వెళ్తారా? స్వర్ణ యుగం కోసం నాతో వస్తారా? అనర్హులను అందలం ఎక్కించి అనేక బాధలు పడుతున్నాం. భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకొని అనేక కష్టాలు పడుతున్నాం. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అందరూ ఓటేశారు. ఒక్కసారే అని కరెంట్‌ తీగలు పట్టుకుంటే షాక్ కొట్టక తప్పదు. జగన్‌కు తెలిసింది.. రద్దులు.. కూల్చివేతలు.. దాడులు, కేసులు మాత్రమే.

రాయలసీమ ద్రోహి.. జగన్‌..
నందికొట్కూరుకు రూ.650 కోట్లతో మెగా సీడ్‌ పార్క్‌ తేవాలనుకున్నాం. ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్‌ పార్కును అటకెక్కించారు. ఓర్వకల్లుకు 15 నెలల్లోనే విమానాశ్రయం తెచ్చాం. 6 మెగావాట్లతో సోలార్‌ పార్క్‌ తెచ్చేందుకు ప్రయత్నించాం. రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయి. సీమలో నీటిపారుదల ప్రాజెక్టులు మొదలుపెట్టింది ఎన్టీఆర్‌. ఇక్కడ నీరు ఉంటే రతనాలు పండుతాయి. స్థానిక వనరులు వాడుకుంటే బయటకు వెళ్లి పనిచేసే అవసరం లేదు. అవుకు టన్నెల్‌ను మేమే పూర్తి చేశాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా అలగనూరుకు మరమ్మతులు చేస్తాం. జగన్‌ వచ్చాక సీమకు ఒక్క ప్రాజెక్టు అయినా వచ్చిందా?ప్రాజెక్టులపై మేం ఖర్చు చేసిన దానిలో 20 శాతం కూడా జగన్‌ ఖర్చు చేయలేదు. రాయలసీమ ద్రోహి.. జగన్‌.

భూ రక్ష చట్టం అమలైతే ఇబ్బందులే..
మీ భూమి పాస్‌బుక్‌లో జగన్‌ బొమ్మ ఎందుకు? రికార్డులు తారుమారు చేసి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భూ రక్ష చట్టం అమలైతే అనేక ఇబ్బందులు వస్తాయి. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఇచ్చారా?మెగా డీఎస్సీ అన్నారు.. ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ వేధింపులతో అమరరాజా, జాకీ కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. తిరుపతిని ఆటోమొబైల్‌ హబ్‌గా చేయాలని అనేక కంపెనీలను తెచ్చాం. కియా పరిశ్రమను తెచ్చిన ఘనత మాదే. వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఐదేళ్లలో మీ జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా?జగన్‌ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోయేవారు ఎవరూ లేరు. యువత భవిష్యత్తుకు నాదీ గ్యారంటీ. యువత తెదేపా-జనసేన జెండా పట్టుకొని ప్రజల్లో చైతన్యం తేవాలి. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే నాతో కలిసి నడవాలి. నేను అందరివాడిని.. అదే నా ప్రత్యేకత’’ అని అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z