2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం కింద ఇచ్చే సాయాన్ని మరో రూ.2 వేలు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల సాయం రూ.8 వేలకు పెరగనుంది. అయితే నిధుల పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పథకంలో భాగంగా కేంద్రం ఇప్పటివరకు 15 విడతల్లో సాయం అందించింది. ఇప్పుడు 16వ విడత సాయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మధ్యలో విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ కింద ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పథకంలో భాగంగా పేద కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి నెలకు 5 కేజీల చొప్పున రేషన్ సరకులను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది.
ఈ విషయంపై గతంలో కూడా వార్తలు వచ్చాయి. కానీ ఏప్రిల్, మేలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, ఓటర్లను ఆకట్టుకోవడానికి కేంద్రం ఈ పెంపు నిర్ణయాన్ని అమలు చేయవచ్చను నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సర్కార్ ఖజానాపై రూ.20వేల కోట్ల భారం!
నిజంగానే రూ.2 వేలు చొప్పున రైతులకు అదనంగా చెల్లించేందుకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయిస్తే సర్కార్ ఖజానాపై రూ.20వేల కోట్ల మేర అదనపు భారం పడనుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది చిన్న సన్నకారు రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది.
గత సార్వత్రిక ఎన్నికల ముందు
గత సార్వత్రిక ఎన్నికల ముందు పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. మూడు విడతలుగా రూ. 2 వేల రూపాయల చొప్పున రైతులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లలో ఈ నిధులు జమ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.
👉 – Please join our whatsapp channel here –