బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుందా? తెలంగాణ అస్థిత్వంతోనే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ వెళ్తుందా..? తెలంగాణ వాదమే తమకు శ్రీరామరక్షగా బీఆర్ఎస్ భావిస్తోందా..? గతంలో తమది జాతీయ పార్టీగా చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, కేసీఆర్ మాస్ ఇమేజ్ తో ఎన్నికల బరిలోకి దిగిన గులాబీ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వలేదు. ఈ తరుణంలోనే పార్లమెంట్ ఎన్నికలు సైతం దగ్గరకు వచ్చాయి. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో.. బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ వాదాన్ని, రాష్ట్ర సెంటిమెంట్ ను తెరపైకి తీసుకువస్తోంది.
అయితే, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం.. తెలంగాణ ఉద్యమ పార్టీగా బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రెండు సార్లు అధికార పగ్గాలు చేపట్టింది.ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీగా ఉన్న పేరును బిఆర్ఎస్ పార్టీగా మార్చుకుంది. బిఆర్ఎస్ పేరుతోనే మూడవ సారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన పార్టీకి నిరాశ తప్పలేదు. దీంతో పార్టీ పేరును మార్చడం ద్వారా తెలంగాణ ఉద్యమ మూలాలను మర్చిపోయినట్లు అయిందనే చర్చ జరుగుతోంది.
ఇక త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి మెరుగైన ఫలితాలు రావాలంటే తెలంగాణ ఉద్యమ నినాదం, అస్తిత్వం తమకు శ్రీరామరక్షగా పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ గళం, తెలంగాణ దళం పేరుతో పార్టీ బ్యానర్లు మార్చేసింది. పార్టీ ఆఫీస్ లోనూ ప్రెస్ మీట్ బ్యాగ్రౌండ్ మార్చేసింది. అందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాల్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ గళం, తెలంగాణ బలం, తెలంగాణ దళం అంటూ.. తెలంగాణ అస్తిత్వ నినాదాన్ని తెరపైకి తెచ్చారు.
ఈ నినాదంతోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సన్నాహాలను ప్రారంభించింది. ఇక తమ పార్టీ పేరును బిఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఏపీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడుని నియమించారు. మరోవైపు మహారాష్ట్రలో మూడు సార్లు కేసీఆర్ పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పలువురు నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు.
ఈ సందర్భంగా సమావేశాల్లో దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీని విస్తరిస్తామని కేసీఆర్ చెప్పారు. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా బిఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుందని గులాబీ బాస్ తెలిపారు. కానీ పరిస్థితులు మారాయి. అధికారం కోల్పోవడంతో మళ్లీ జై తెలంగాణ అంటూ ప్రజల్లోకి వెళ్లనుంది BRS. ఎక్కడ పోగొట్టుకున్నామో … అక్కడే వెతుక్కోవాలి అనే తరహాలో గులాబీ పార్టీ ఆలోచిస్తుంది.
👉 – Please join our whatsapp channel here –