ఇండిగో (IndiGo) విమానాల్లో ఎక్కువ లెగ్ రూమ్ ఉండే ముందు సీట్ల ఎంపిక కోసం ప్రయాణికులు రూ.2,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆ సంస్థ సీట్ల ఎంపిక ఛార్జీలను పెంచింది.
ఇండిగో (IndiGo) వెబ్సైట్లో వివిధ సేవలకు పేర్కొన్న రుసుముల ప్రకారం.. 232 సీట్లు ఉండే ఎయిర్‌బస్ A321 విమానంలో ముందు వరుసలోని విండో లేదా ‘నడవా సీటు (Aisle seat)’ ఎంపిక కోసం రూ.2,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే మధ్య సీటుకు రూ.1,500 వసూలు చేస్తున్నారు. A321 (222 సీట్ల రకం), A320 విమానాలకూ ఇదే తరహా ఛార్జీలు వర్తిస్తాయి. ఏటీఆర్ విమానాల్లో మాత్రం సీటు ఎంపిక ఛార్జీ రూ.500 వరకు ఉంది.
దీనిపై ఇప్పటి వరకు ఇండిగో (IndiGo) అధికారిక ప్రకటన చేయలేదు. విమానయాన విశ్లేషకుడు అమేయ జోషి ఈ ఛార్జీల పెంపును ధ్రువీకరించారు. అదనపు లెగ్‌రూం ఉండే సీట్ల కోసం ఇండిగో రూ.2,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఇది రూ.1,500 వరకు ఉండేదన్నారు. మిగతా వరుసల్లోని సీట్ల ఎంపిక ఛార్జీల్లో ఏమైనా మార్పులున్నాయేమో మాత్రం తెలియలేదు.
ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్నట్లు ఇండిగో (IndiGo) ఇటీవలే ప్రకటించింది. దీంతో టికెట్ల ధరలు కనిష్ఠంగా రూ.300 మేర తగ్గాయి. కొన్ని సుదూర మార్గాల్లో అయితే రూ.1,000 వరకు తగ్గినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో విమాన ఇంధన ధరలు తగ్గిన నేపథ్యంలో జనవరి 4 నుంచి ఇంధన ఛార్జీని ఉపసంహరిస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.
👉 – Please join our whatsapp channel here –