DailyDose

కళాకారులకు 6 వేల పింఛన్‌పై త్వరలో నిర్ణయం

కళాకారులకు 6 వేల పింఛన్‌పై త్వరలో నిర్ణయం

అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా రూ.6వేల చొప్పున పెన్షన్‌ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరవలేనిదని ఆయన చెప్పారు. తెలంగాణ జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్‌ను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారని, యావత్‌ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసింది కళాకారులేనన్నారు. ఉద్యమ సమయంలో కవులు, కళాకారులు, రచయితలే తనకు స్ఫూర్తినిచ్చినట్లు, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పర్యాటకాభివృద్ధిలో కళాకారులను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదని.. సీఎం రేవంత్‌ రెడ్డి అందరికీ న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు.

5వేలకుపైగా కళాకారులు ఉంటే గత ప్రభుత్వంలో 2వేల మందికి మాత్రమే పెన్షన్‌ ఇచ్చినట్లు పేర్కొంటూ.. ఈ విషయమై సీఎంతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాయిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, యావ కళావాహిని సారిపల్లి కొండల్‌ రావు, తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి సుంచు లింగయ్య పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z