దేశ రాజధాని దిల్లీలో మంగళవారం 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గ్రహీతలకు అవార్డులను అందజేశారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న అవార్డును సొంతం చేసుకుంది. టీమ్ఇండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ షమి.. దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకున్నాడు. ‘‘అర్జున అవార్డు ఒక కల. జీవితకాలం గడిచిపోతున్న ఎంతోమంది ఈ అవార్డును అందుకోలేకపోతున్నారు. అర్జున అవార్డుకు నేను ఎంపికైనందుకు సంతోషిస్తున్నాను’’ అని షమి పేర్కొన్నాడు. సాత్విక్- చిరాగ్ జోడీ ఆసియా క్రీడల్లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలతో మెరిసింది.
2023 వన్డే ప్రపంచకప్‌లో షమి అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఏడు మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలోనూ అతడిదే అగ్రస్థానం. ప్రపంచకప్‌లో ఒక్కసారి అయిదు వికెట్లు సాధించడం ఎంతో కష్టం. అలాంటిది షమి ఏకంగా అయిదుసార్లు ఈ ఘనత సాధించాడు. మొత్తం 26 మంది అర్జున అవార్డులను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈషా సింగ్ (షూటింగ్), మహ్మద్ హుసాముద్దీన్ (బాక్సింగ్), అజయ్‌కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్)లకు ఈ అవార్డులు దక్కాయి.
👉 – Please join our whatsapp channel here –