DailyDose

2036 నాటికి 6.4 కోట్ల కొత్త ఇళ్లు అవసరం

2036 నాటికి 6.4 కోట్ల కొత్త ఇళ్లు అవసరం

పెరుగుతున్న జనాభా అవసరాల కోసం 2036 నాటికి అదనంగా 6.4 కోట్ల కొత్త ఇళ్ల అవసరం ఉంటుందని క్రెడాయ్‌-లియాసెస్‌ ఫోరాస్‌ నివేదిక అంచనా వేసింది. మంగళవారం వారణాసిలో నిర్వహించిన న్యూ ఇండియా సదస్సులో ఈ నివేదికను రెండు సంస్థలు విడుదల చేశాయి. 2018 నాటికి 2.9 కోట్ల ఇళ్లకు కొరత ఉందని ఈ నివేదిక పేర్కొంది. 2036 నాటికి మొత్తం 9.3 కోట్ల గృహాలకు గిరాకీ ఉంటుందని అంచనా వేసింది. స్థిరాస్తి రంగంలో తదుపరి వృద్ధి ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల నుంచే ఉంటుందని పేర్కొంది. గత ఏడాది ఇళ్లకు అధిక గిరాకీ ఏర్పడిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా 19,050కి పైగా ప్రాజెక్టులు రెరా దగ్గర నమోదయ్యాయని, ఇందులో 45 శాతానికి పైగా నివాస ప్రాజెక్టులున్నాయని వెల్లడించింది. ఈ సందర్భంగా క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ మాట్లాడుతూ దేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా వల్ల ఇళ్లకు గిరాకీ, సరఫరా వృద్ధి చెందుతోందన్నారు. అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పెద్ద గృహాల కోసం చూస్తున్నారని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయనిపేర్కొన్నారు. క్రెడాయ్‌ ఛైర్మన్‌ మనోజ్‌ గౌర్‌ మాట్లాడుతూ.. గత ఏడాది స్థిరాస్తి రంగం గుర్తుంచుకోదగ్గ సంవత్సరంగా నిలిచిందని వివరిస్తూ, 2024లోనూ ఇదే తరహా వృద్ధి, గిరాకీ లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరే క్రమంలో స్థిరాస్తి రంగం పాత్ర ఎంతో కీలకమని లియాసెస్‌ ఫోరాస్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పంకజ్‌ కపూర్‌ అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z