Agriculture

వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తు పక్కదారి పడుతోందా?

వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తు పక్కదారి పడుతోందా?

వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తు పక్కదారి పడుతోందా? అక్రమంగా ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారా? అవుననే అంటోంది దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ. సంస్థకు కొత్త సీఎండీగా ముషారఫ్‌ ఫరూకీ బాధ్యతలు చేపట్టాక సాంకేతిక, పంపిణీ నష్టాలను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా విద్యుత్తు చౌర్య నిరోధక విభాగం (డీపీఈ), విజిలెన్స్‌ కలిసి క్షేత్ర స్థాయిలో వాణిజ్య, గృహ, వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల తనిఖీలు చేపట్టాయి. ఇందులో విస్తుపోయే విషయాలను అధికారులు గుర్తించి, 250 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌ నగరంతో పాటు జిల్లాల్లోని పట్టణాలకు సమీపంలోని వ్యవసాయ భూములు చాలావరకు వెంచర్లుగా మారాయి. వాటిలోనూ పాత కనెక్షన్లు అలాగే కొనసాగుతున్నాయి. గతంలో ఇంజినీర్లే గుర్తించి..వాటి కేటగిరీ మార్చాలని చెప్పినా కార్పొరేట్‌ కార్యాలయం నుంచి స్పందన రాలేదు. పైగా అక్రమ వాడకం కొందరు క్షేత్రస్థాయి సిబ్బందికి కాసుల పంట పండిస్తోంది. కావాల్సినప్పుడల్లా వారి నుంచి డబ్బు గుంజుతున్నారు.

డెయిరీ కోసం..
ఉచిత విద్యుత్తును పూర్తిగా వ్యవసాయానికి వాడుకోవాలి. ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో తనిఖీలు చేపట్టగా డెయిరీ ఫాం, కోళ్లు, గొర్రెలు, మేకల పెంపకం, నర్సరీలు, ఇటుక బట్టీలకు ఉచిత కరెంట్‌ కనెక్షన్‌ వాడుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. వ్యవసాయానికి కాకుండా ఇతరత్రా వాటికి వాడే విద్యుత్తుపై తొలుత కేసులు నమోదు చేసి.. అనంతరం జరిమానా ఎంత అనేది నిర్ణయిస్తున్నారు. ఎవరైనా వ్యవసాయానికి కాకుండా.. వేరే వాటికి ఉచిత విద్యుత్తు వాడుతుంటే వెంటనే ప్రత్యేక కనెక్షన్‌ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z