Politics

కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధమయ్యారా?

కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధమయ్యారా?

టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత వైసీపీలో చేరుతారన్న ప్రచారం ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికే వైసీపీ నాయకులు కేశినేనితో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం 3గంటలకు సీఎం జగన్ తో కేశినేని నాని భేటీ కాబోతున్నారు. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా కేశినేని నానిని బరిలోకి దింపే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దికాలంగా టీడీపీతో కేశినేని నాని అంటీముట్టనట్లు ఉంటున్నారు. తాను టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే, ఫిబ్రవరి మొదటి వారంలో ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ తరువాత టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

గత రెండు రోజుల క్రితం విజయవాడ కార్పొరేషన్ లో కార్పొరేటర్ పదవికి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మేయర్, కమిషనర్ కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. త్వరగా తన రాజీనామాను ఆమోదింపజేయాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కార్పొరేటర్ గా తన రాజీనామా ఆమోదించిన తరువాత టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆమె ప్రకటించారు. ఏడాదిన్నరగా ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. అధినేత నందిగామ వచ్చినా, విజయవాడ వచ్చినా కేశినేని నానికి పిలుపులేదని శ్వేత ఆవేదన వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. కేశినేని నానిని పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దన్నప్పుడు పార్టీలో ఉండటం సమంజసం కాదు.. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేశినేని నాని ఎంపీగా పోటీ చేస్తారని, ఇండిపెండెంట్ గానా? మరో విధంగానా అనేది త్వరలో తెలుస్తోందని, మూడోసారి లోక్ సభలో కేశినేని నాని తప్పకుండా అడుగు పెడతారని శ్వేతా అన్నారు.

గత కొద్దిరోజులుగా కేశినేని నాని తాను విజయవాడ నుంచి ఎంపీగా ఖచ్చితంగా పోటీచేస్తానని చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లాలంటే చాలా ట్రైన్లు ఉంటాయి.. ఏ ట్రైన్ ఎక్కుతాననేది నా వ్యూహం ప్రకారం ఉంటుందని నాని తన మద్దతుదారుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ క్రమంలో కేశినేని నాని వైసీపీ ట్రైన్ ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలు నానితో చర్చలు జరిపారని, వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా నానిని బరిలోకి దింపేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగాసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ తో భేటీ తరువాత కేశినేని నాని ఎలాంటి ప్రకటన చేస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో చేరికపై క్లారిటీ ఇస్తారా? లేదంటే.. మర్యాదపూర్వకంగానే సీఎం జగన్ ను కలిశానని చెబుతారా? అనేది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ మారింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z