Fashion

మెహిదీపట్నంలో యాసిడ్ తో హెన్నా తయారీ

మెహిదీపట్నంలో యాసిడ్ తో హెన్నా తయారీ

తలకు పెట్టుకునేందుకు మహిళలు, పురుషులు వాడే హెన్నాను ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్న మెహిదీపట్నంలోని ఓ యూనిట్‌ను తెలంగాణ ఔషధ నియంత్రణ విభాగం అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. అక్కడ నుంచి పెద్దఎత్తున హెన్నా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పిక్రామిక్‌ యాసిడ్‌ అనే విషపూరిత రసాయనాన్ని ఉపయోగించి తయారు చేస్తున్నట్లు గుర్తించినట్లు డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు. మెహిదీపట్నంలోని షకిల్‌ ఇండస్ట్రీస్‌ పేరుతో ఈ హెన్నాను తయారు చేసి ‘స్పెషల్‌ కరాచీ మెహందీ కోన్‌’ పేరుతో విక్రయిస్తున్నారు. పిక్రామిక్‌ యాసిడ్‌ అనే సింథటిక్‌ డై వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. జుత్తు అందం దెబ్బతింటుంది. ఈ ఉత్పత్తికి బీఎస్‌ఐ గుర్తింపూ లేదని అధికారులు తెలిపారు. హనుమకొండలో ఈ నకిలీ హెన్నాను గుర్తించి అక్కడ అధికారులు తీగలాగితే చివరికి మెహిదీపట్నంలో డొంక కదిలింది. ఈ ఉత్పత్తి వెనుక అసలు గుట్టు రట్టు అయింది. షకీల్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ అలీ దీనికి కారకుడిగా గుర్తించి అతని నుంచి భారీ హెన్నా స్టాకును స్వాధీనం చేసుకొని, శాంపిళ్లను సేకరించి లాబ్‌కు పంపినట్లు వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు. విచారణ తర్వాత నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడిలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు జె.కిరణ్‌కుమార్‌, పి.సంతోష్‌, సి.వివేకానందరెడ్డి, వి.అజయ్‌ తదదితరులు పాల్గొన్నారు. బీఎస్‌ఐ గుర్తింపు లేని ఇలాంటి సౌందర్య ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z