పందేలకు సిద్దంగా ఉన్న కో’ఢీ’పుంజులు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగైన సంక్రాంతి సందర్భంగా మూడు రోజులపాటు కోడి పందేలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందేలు, భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డూడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు, అడపడుచుల సంబరాలు ఇలా వీటన్నిటి మధ్యలో పోటాపోటీగా కోడి పందాలు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే పల్లెల్లో కోడిపందాల
జోరు అంతా ఇంతా కాదు. అయితే పండుగకు ఐదు నెలల ముందు నుంచే కోడిపందేలకు సన్నద్దమవుతుంటారు. కోడిపందాలకు లక్షల్లో ఖర్చుపెట్టి పుంజులు కొనుగోలు చేస్తుంటారు. తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, ఎ.కొండూరు, గంపలగూడెం, విస్సన్నపేట మండలాల్లో ఇప్పటికే పందెం
రాయుళ్లు ఆయా గ్రామాల సమీపంలోని మామిడి తోటల్లో ట్రాక్టర్లతో భూమిని చదును చేసి బరులు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ రాళ్లకు ముళ్లకంచెను వేసి పందేలకు సిద్ధం చేశారు. ఈ పందాలకు విజయవాడ, నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, తదితర పట్టణాలకు చెందిన పందెం రాయుళ్ళు ప్రత్యేక వాహనాల్లో వచ్చి లక్షల్లో పందేలు కాస్తుంటారు. ఇప్పటికే స్థానికంగా పందెం వేసే నిర్వాహకులు, ఇతర ప్రాంతాల పందెం రాయుళ్లతో లక్షల్లో పందాలు వేయడానికి బేరసారాలు కుదుర్చుకున్నారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా బరులు సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులు నిబంధనలకు విరుద్ధంగా కోడి పందేలు, జూదాలు
నిర్వహిస్తే ఉక్కు పాదం మోపుతామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు చేసినప్పటికీ, వాటిని
పందెం రాయుళ్లు బేఖాతరు చేస్తూ బరులు ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. చివరికి
ప్రజాప్రతినిధులు అండదండలతో పండగ మూడు రోజులు పాటు ప్రభుత్వం నుండి అనధికారికంగా
అనుమతులు పొంది పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. పోలీసుల హెచ్చరికలు
మామూలేనని పండగ మూడు రోజులపాటు పందేలు నిర్వహించటానికి పందెం రాయుళ్ళు సిద్ధమవుతున్నారు. ఈసారి ఈ ప్రాంతంలో భారీగా కోడిపందాలు నిర్వహించడానికి పందెం రాయుళ్లు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –