ఏపీఎస్‌ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న కార్గోలో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పార్శిళ్లు, కవర్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని బుధవారం నుంచి ప్రారంభించినట్లు ఎండీ సీహెచ్.ద్వారకాతిరుమలరావు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా తొలుత విజయవాడలో మొదలుపెట్టామని, త్వరలో రాష్ట్రం అంతటా ఈ సేవలు తీసుకొస్తామన్నారు. apsrtclogistics.in వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుంటే.. కార్గో సిబ్బంది వచ్చి కవర్, పార్శిల్ తీసుకెళ్తారని పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కవర్ లేదా పార్శిల్‌కు పికప్ ఛార్జీలు ఉంటాయని చెప్పారు. పార్శిల్ తీసుకెళ్లేందుకు వచ్చే వ్యక్తితో ప్యాకింగ్ చేయించుకుంటే దానికి అదనపు ఛార్జీ ఉంటుందన్నారు. ఒకసారి పికప్ చేసుకునే వ్యక్తి ఇంటికొచ్చాక బుకింగ్ రద్దు చేసుకున్నా పికప్ ఛార్జీ మినహాయించుకుంటామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది విధానపరమైన నిర్ణయమని, దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదన్నారు. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి నడిపే ప్రత్యేక సర్వీసులకు అదనంగా వెయ్యి బస్సులు పెంచినట్లు తెలిపారు. కేంద్రం టెండర్ల ద్వారా ఎంపిక చేసే అద్దె విద్యుత్ బస్సుల్లో రాష్ట్రానికి వెయ్యి అవసరమని ప్రతిపాదన పంపామని, అవి వస్తే దాదాపు 1,800 మంది వరకు సిబ్బంది అవసరం ఉండదని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –