Politics

ప్రభుత్వానికి కాస్త ఊరట

ప్రభుత్వానికి కాస్త ఊరట

రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టింది. ఖాళీ ఖజానాతో కష్టాల్లో ఉన్న సమయంలో కొంత ఊరట లభించింది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలతో కూడిన చివరి త్రైమాసికంలో రూ.9,000 కోట్ల అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో తొలుత రూ.2,000 కోట్లను ఈ నెల 16వ తేదీన తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాగా, రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన అప్పులో వెయ్యి కోట్లు మినహా మిగతా అప్పును గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటికే తీసుకోవటంతో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నిధుల కటకట ఏర్పడింది. చివరి త్రైమాసికంలో అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రూ.13,000 కోట్ల అదనపు అప్పు కావాలని, ఈ మేరకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసింది. ఇటీవల రెండు సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి అదనపు అప్పు గురించి ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉందని వివరించారు. రూ.13 వేల కోట్ల అదనపు అప్పు ఇవ్వాలని కోరారు. ఆర్బీఐ డిసెంబరులో ప్రకటించిన అడ్వాన్స్‌డ్‌ కేలండర్‌లోనూ తెలంగాణకు సంబంధించిన రూ.13 వేల కోట్ల వివరాలను వెల్లడించారు. అయితే… రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు మాత్రం బడ్జెట్‌లోని నికర, స్థూల అప్పుల వివరాలను సమగ్రంగా సమీక్షించి రూ.15 వేల కోట్ల అప్పు కావాలంటూ ఇటీవల కేంద్రానికి ప్రతిపాదించారు.

ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం నికరంగా తీసుకున్న అప్పు కాకుండా… స్థూల అప్పును పరిగణనలోకి తీసుకుని రూ.15 వేల కోట్లను ఇవ్వాలని కోరారు. ఇలా వచ్చిన విజ్ఞప్తులు, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రూ.9,000 కోట్ల అప్పునకు కేంద్రం తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 16న జరిగే ఆర్బీఐ వేలం పాటలో పాల్గొనవచ్చని సూచించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిదశలో రూ.2,000 కోట్ల అప్పు తీసుకునే అవకాశాలున్నాయి. దీనికోసం ఈ నెల 12వ తేదీన ఆర్బీఐకి ఇండెంటు పెట్టనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ప్రతిపాదించిన మొత్తం రూ.15 వేల కోట్లలో రూ.9 వేల కోట్ల అప్పుకే కేంద్రం అనుమతి ఇవ్వడంతో మిగతా రూ.6,000 కోట్ల అప్పు వచ్చే అవకాశాలున్నాయా? లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి ఈసారి బడ్జెట్‌లో రూ.40,615 కోట్ల అప్పును అంచనా వేశారు. ఇందులో డిసెంబరు నాటికి రూ.39,051 కోట్ల అప్పు తీసుకున్నారు. ఇది నికరంగా తీసుకున్న అప్పు అని, స్థూల అప్పు రూ.50 వేల కోట్లకు పైగా తీసుకోవచ్చని చెబుతున్నారు. ఈ లెక్కన మిగతా రూ.6,000 కోట్ల అప్పు కోసం కూడా ప్రయత్నిస్తామని అధికారులు అంటున్నారు.

సర్కారుకు ఊరట

రూ.9,000 కోట్ల అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఊరట లభించినట్లయ్యింది. తక్షణ అవసరాల కోసం ఈ సొమ్ము పనికొస్తుందని భావిస్తోంది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ.. అధికారం చేపట్టగానే ఖాళీ ఖజానా కనిపించింది. దీంతో కొత్త ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో, కేంద్రం అనుమతించిన రూ.9 వేల కోట్ల అప్పుతో ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z