* ‘రిపబ్లిక్ డే సేల్’కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్
ఫ్లిప్‌కార్ట్ ‘రిపబ్లిక్ డే సేల్’ (Republic Day sale 2024)కు సిద్ధమైంది. జనవరి 14 నుంచి 19 వరకు మొత్తం ఆరు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందే అంటే జనవరి 13 అర్ధరాత్రి నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. ఏయే ఫోన్లపై రాయితీలు, ఆఫర్లు ఉన్నాయనే వివరాలను సంస్థ ప్రకటించింది.స్మార్ట్‌ఫోన్ ఆఫర్ల విషయానికొస్తే.. మోటోరొలా ఎడ్జ్ 40 నియో (motorola edge 40neo), గూగుల్ పిక్సెల్ 7ఎ (Google Pixel 7a), శాంసంగ్ ఎస్21 ఎఫ్‌ఈ 5జీ (Samsung S21 FE 5G), రియల్‌మీ 11 ఎక్స్ 5జీ (Realme 11X 5G), శాంసంగ్ ఎఫ్14 5జీ (Samsung S14 5G), మోటో జీ54 5జీ (moto G54 5G), రియల్‌మీ సీ 53 (realme C53) సహా మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ఉండనున్నట్లు వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. కొత్తగా విడుదల కానున్న ఫోన్లపై కూడా రాయితీ అందించనున్నట్లు వెల్లడించింది.వీటితోపాటు ఫ్యాషన్ యాక్సెసరీస్‌పై 50 నుంచి 80 శాతం… అప్లయెన్సస్‌పై 75 శాతం వరకు ఆఫర్లు ఉంటాయి. బ్యూటీ, ఫుడ్, టాయ్స్‌పై 85 శాతం వరకు, పర్నిచర్‌లపై 80 శాతం వరకు పొందొచ్చు. అయితే క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ఏయే బ్యాంకు కార్డులపై ఇస్తారు అనేది ఇంకా ప్రకటించలేదు.
* లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. వరుసగా మూడో సెషన్‌లో సూచీలు లాభాలను నమోదు చేశాయి. సూచీలు ఇవాళ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 71,383.20 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఆ తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడేలో 71,11098 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్.. 71.773.54 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 271.50 పాయింట్లు పెరిగి 71,657.71 పాయింట్ల వద్ద ముగిసింది.నిఫ్టీ 73.90 పాయింట్లు లాభంతో 21,618.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. దాదాపు 1,772 షేర్లు పురోగమించగా.. 1,495 షేర్లు క్షీణించాయి. 75 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో సిప్లా, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఓఎన్‌టీసీ, దివీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నష్టపోయాయి. సెక్టార్లలో హెల్త్‌కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్ ఒక్కొక్కటి 0.4శాతం చొప్పున పెరగ్గా.. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.5 శాతం తగ్గింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి.
* 14 వేలకే కొత్త ట్యాబ్
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ లెనోవా ‘కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో 2024 (Consumer Electronics Show 2024)’ ను ప్రారంభించింది. లెనోవా ట్యాబ్ ఎమ్10 (Lenovo Tab M10)కు వచ్చిన ఆదరణతో అదే సిరీస్‌లో కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. లెనోవా ట్యాబ్ ఎమ్11 (Lenovo Tab M110) పేరిట దీన్ని ఆవిష్కరించింది. రెండు ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తున్నట్లు లెనోవా ప్రకటించింది.లెనోవా ట్యాబ్ ఎమ్11 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,900గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధరను మాత్రం వెల్లడించలేదు. లునా గ్రే, సిఫోమ్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఏప్రిల్ నుంచి అమెరికాలో విక్రయాలు ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది. భారత్‌లోకి ఎప్పుడు తీసుకొస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
* గుజరాత్ సమ్మిట్‌లో అదానీ గ్రూప్ ఛైర్మన్ కీలక ప్రకటన
గుజరాత్ అభివృద్ధికి రిలయన్స్ సంస్థ కట్టుబడి ఉంటుందని ముఖేష్ అంబానీ తెలిపారు. ఇవాళ గాంధీనగర్‌లో ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్‌లో ఆయన మాట్లాడుతూ.. గుజరాత్‌లో తన మూలాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కంపెనీ నిబద్ధత గురించి తెలియజేశారు. రిలయన్స్ ఎప్పటికీ గుజరాతీ కంపెనీ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ ప్రధాన మంత్రి మోడీకి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ 20 ఏళ్ల నుంచి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోందన్నారు. మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు.. 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారకుండా భారత్ ను ఏ శక్తి అడ్డుకోలేదని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.ఇక, మోడీ ప్రపంచ నాయకత్వాన్ని, అసాధ్యాలను సుసాధ్యం చేయగల నాయకుడని అంబానీ చెప్పుకొచ్చారు. ప్రధానిగా మోడీ ఉంటేనే అన్ని సాధ్యం అవుతాయని చెప్పారు.. విజన్, డిటర్మినేషన్, ఎగ్జిక్యూషన్ ఉన్న ప్రధాని మోడీ కోట్ల మంది భారతీయులను ప్రతిబింబిస్తుంది.. ప్రపంచ దేశాల ప్రశంసలను ప్రస్తుతం భారత్ అందుకుంటోందని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దంలో రిలయన్స్ $150 బిలియన్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.. ఇందులో మూడింట ఒక వంతు గుజరాత్‌కే కేటాయించామని తెలిపారు.. రిలయన్స్ రాబోయే పదేళ్లలో గణనీయమైన పెట్టుబడులతో గుజరాత్ వృద్ధిలో కీలక పాత్ర పోషించబోతుందని చెప్పుకొచ్చారు.. గ్రీన్ గ్రోత్‌లో గుజరాత్ ప్రపంచ అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని ముఖేష్ అంబానీ వెల్లడించారు.2030 నాటికి రాష్ట్ర ఇంధన అవసరాలలో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కృషి చేస్తుంది అని ముఖేష్ అంబానీ చెప్పారు. రిలయన్స్ జియో ప్రపంచ వ్యాప్తంగా 5జీ సేవలను అత్యంత వేగంగా మార్కెట్ లోకి తీసుకొచ్చాం.. గుజరాత్‌ను పూర్తిగా 5జీ-ఎనేబుల్ చేశాం.. డిజిటల్ డేటా ప్లాట్‌ఫారమ్‌తో పాటు ఏఐ అడాప్షన్‌లో గుజరాత్ స్టేట్ గ్లోబల్ లీడర్‌గా నిలిచింది అని ఆయన తెలిపారు. 5జీ-ఎనేబుల్డ్ ఏఐ విప్లవం మిలియన్ల కొద్దీ కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం లాంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకు వస్తుందని అంబానీ పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –