Business

‘గుజరాత్‌ అంతర్జాతీయ సదస్సు 2024’లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి

‘గుజరాత్‌ అంతర్జాతీయ సదస్సు 2024’లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి

భారతదేశ ఆర్థిక వ్యవస్థ (Indian Economy) వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. 2027-28 నాటికి 5ట్రిలియన్‌ డాలర్లతో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గాంధీనగర్‌లో జరుగుతున్న ‘గుజరాత్‌ అంతర్జాతీయ సదస్సు 2024’ లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

‘2027-28 నాటికి భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉంది. అదే ఏడాదిలో జీడీపీ 5 ట్రిలియన్‌ డాలర్ల మైలురాయిని దాటుతుంది. అంచనా ప్రకారం.. 2047 నాటికి ఆర్థిక వ్యవస్థ దాదాపు 30 ట్రిలియన్ డాలర్లకు చేరనుంది’ అని మంత్రి అన్నారు. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీల తర్వాత దాదాపు 3.4 ట్రిలియన్‌ డాలర్లతో భారత్‌ ఐదో ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. ఈ ఏడాదిలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.3శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసినట్లు వెల్లడించారు.

23 సంవత్సరాల్లో (2022 నుంచి 2023 వరకు) 919 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయన్నారు. వీటిలో 65శాతానికి (595 బిలియన్‌ డాలర్లు) పైగా పెట్టుబడులు గత 8-9 ఏళ్ల మోదీ పాలనలోనే సాధ్యమైందన్నారు. బ్యాంకు ఖాతాల గురించి ప్రస్తావిస్తూ.. 2014లో 15 కోట్ల మంది ప్రజలకు మాత్రమే బ్యాంక్‌ ఖాతాలు ఉండేవని, ప్రస్తుతం ఆ సంఖ్య 50 కోట్లకు పెరిగిందని కేంద్రమంత్రి తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z