DailyDose

సూర్యాపేటలో మహిళపై దాడి-నేర వార్తలు

సూర్యాపేటలో మహిళపై దాడి-నేర వార్తలు

* సూర్యాపేటలో మహిళపై దాడి

ఉద్యోగాల(Jobs) పేరుతో పేరుతో మోసం చేసిన ఓ మహిళను బాధితులు చితకబాదారు. ఈ సంఘటన సూర్యాపేటలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేట(Suryapet) వైద్య కళాశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ మహిళ మోసం(woman cheated) చేసిందని ఆగ్రహించిన బాధితులు ఆమెపై దాడికి పాల్పడి స్థానిక ముత్యాల ఆలయంలో బంధించారు. సుమారు రూ.60 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహిళను విడిపించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* కొండగట్టు హుండీ లెక్కింపులో దొంగతనం కలకలం

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయ హుండీ లెక్కింపులో దొంగతనం కలకలం రేపింది. స్వామివారి ప్రసాద తయారీ కేంద్రంలో పనిచేసే ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. లెక్కింపు చేసేందుకు వచ్చిన సదరు ఉద్యోగి రూ. 10వేలను దొంగిలిస్తుండగా అధికారులు గుర్తించారు. అనంతరం ఉద్యోగిని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. దొంగతనం చేస్తూ పట్టుబడిన వ్యక్తి కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కోలకాని రవిగా గుర్తించారు.అయితే గతంలో కూడా హుండీ లెక్కింపు సందర్బంగా ఆలయానికి సంబంధం ఉన్న ఓ ప్రముఖ వ్యక్తి దొంగతనం చేసినట్లుగా ఆరోపణలు రాగా విషయం ఎండోమెంట్ కమిషనర్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన సంఘటన ఆలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హుండీ లెక్కింపు సందర్భంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

* ప్రాణం తీసిన బొగ్గుల కుంపటి

చలి నుంచి ఉపశమనం కోసం ఏర్పాటు చేసిన బొగ్గుల కుంపటి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులను బలిగొంది. వారంతా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..అమ్రోహా జిల్లాకు చెందిన కుటుంబం.. సోమవారం రాత్రి పడుకునే ముందు బొగ్గుల కుంపటిని ఏర్పాటు చేసుకుంది. ఇంటి తలుపులు, కిటీకీలు మూసివేసి నిద్రపోయారు. కాసేపటికి కుంపటి నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఊపిరాడక ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. మరుసటి రోజు సాయంత్రం వరకు ఆ ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. లోపలి వైపు నుంచి గడియ పెట్టి ఉండడంతో తలుపు పగలగొట్టి పోలీసులకు సమాచారం అందించారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* యువకులు చేసిన పనికి అంతా షాక్!

స్మార్ట్ ఫోన్లు వచ్చాక రహస్యం అనేది లేకుండా పోయింది. ఫన్నీ ముచ్చట్లతోపాటు పార్టనర్స్ ఏకాంతంగా ఉన్న బెడ్ రూం వీడియోలు కూడా ప్రపంచానికి చేరిపోతున్నాయి. ముఖ్యంగా ఆకతాయిలు, బ్లాక్ మెయిలర్స్ చేతిలో ఉన్న ఫోన్లతో పెను ప్రమాదం ఏర్పడుతుంది. తాజాగా ఇద్దరు దుర్మార్గులు చేసిన పనికి ఓ వివాహిత చిక్కుల్లో పడింది. ఆమె నగ్నదేహాన్ని అంగట్లో పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.బల్లియా జిల్లా బన్స్‌దిహ్‌ రోడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత 2023 అక్టోబర్‌లో స్నానం చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన అష్ఫాక్‌ ఖాన్‌ రహస్యంగా ఆమె నగ్న వీడియోలు, ఫొటోలు తీశారు. ఆ తర్వాత ఆమెకు ఆ ఫొటోలు, వీడియోలు చూపించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను చెప్పినట్లు వినకపోతే వాటిని ఇంటర్ నెట్‌లో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. అయితే తన దగ్గర డబ్బులు లేవని ఆ మహిళ ఎంత బతిమిలాడినా అష్ఫాక్‌ ఖాన్‌ వినిపించుకోలేదు. దీంతో ఆ నగ్న ఫొటోలను ఆమె భర్త వాట్సాప్‌కు పంపించాడు. వాటిని చూసి ఖంగుతిన్న భర్త అష్ఫాక్‌ ఖాన్‌‌ను మందలించాడు.భార్యభర్తలపై కోపం పెంచుకున్న అష్ఫాక్‌ ఖాన్‌ తాజాగా వివాహిత నగ్న ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశాడు. ఈ దుశ్చర్యకు సవ్రు డ్యామ్‌ గ్రామానికి చెందిన ఫిరోజ్‌ షేక్‌ సహకరించాడు. అనంతరం వీరిద్దరు కలిసి సదరు వివాహితపై దాడి చేసి, చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ మహిళ జనవరి 8న బన్స్‌దిహ్‌ రోడ్‌ పోలీస్‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుధవారం అష్ఫాక్‌ ఖాన్‌, ఫిరోజ్ షేక్‌‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఇద్దరిపై హత్యాయత్యం, ఛీటింగ్, సైబర్ క్రైం తదితర కేసులు పెట్టినట్లు తెలిపారు.

* భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య

హైదరాబాద్‌ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల అకస్మాత్తుగా రక్తపోటు ఎక్కువై భర్త హఠాన్మరణం పాలవడాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మరణంతో తీవ్రంగా కుంగిపోయి చివరికి ఉసురు తీసుకుంది. మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రహీంపురాకు చెందిన అమన్‌కుమార్‌ సింగ్ ‌(36), అప్పర్‌ ధూల్‌పేట ఆరాంఘర్‌ కాలనీకి చెందిన అస్మిత (31) భార్యాభర్తలు. వీరికి రోనక్‌, రిత్విక్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గచ్చిబౌలిలో ప్రైవేటు ఉద్యోగం చేసే అమన్‌కుమార్‌ సింగ్‌ గత నెల 26న రాత్రి ఒక్కసారిగా బీపీ ఎక్కువై బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతిచెందాడు.అప్పటి నుంచి 15 రోజులుగా అస్మిత మానసిక వేదనను అనుభవించింది. భర్త ఫొటోను దగ్గర పెట్టుకొని బాధపడింది. చివరికి మనస్తాపంతో మంగళవారం సాయంత్రం ఆరాంఘర్‌ కాలనీలోని పుట్టింట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* ఏపీలో దారుణం

దేశంలో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట గ్యాంగ్ రేప్ లు, చిన్నపిల్లలపై అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధులు ఆగడం లేదు. అతి దారుణంగా ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో అత్యాచార ఘటన చోటు చేసుకుంది.చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నక్కనపల్లి గ్రామంలో మైనర్ బాలిక పై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత 2 నెలలుగా ఆ బాలిక పై వృద్ధుడు సంపగి రెడ్డి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా కుటుంబసభ్యులకు తెలియడంతో బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితుడు సంపంగి రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు.. బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాళ్లబుదుగూరు పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z