హరియాణాకు చెందిన ఓ ఆవు 24 గంటల వ్యవధిలో 80 లీటర్ల పాలు ఇచ్చి రికార్డు సృష్టించింది. కురుక్షేత్రలో నిర్వహించిన పోటీల్లో షకీరా అనే ఆవు ఈ రికార్డు సాధించింది. కర్నాల్ జిల్లాలోని ఝిఝారీకి చెందిన సునీల్, శాంకీ అనే ఇద్దరు సోదరులు ఈ ఆవును పెంచుతున్నారు. పోటీలో భాగంగా 8 గంటల విరామం ఇస్తూ రోజులో మూడుసార్లు యంత్రాల ద్వారా ఆవుకు పాలు పితికారు. 80 లీటర్లకు పైగా పాలు ఇచ్చిన షకీరా.. పోటీలో తొలి స్థానంలో నిలిచి బుల్లెట్ బైక్‌ను సొంతం చేసుకుంది. దీంతో పాటు ఆసియా రికార్డును సైతం కైవసం చేసుకుంది. ‘‘డీఎఫ్‌ఐ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. హరియాణా, పంజాబ్ సహా దూర ప్రాంతాల నుంచి అనేక ఆవులు పోటీలో పాల్గొన్నాయి. ఎక్కువ పాలిచ్చి ఈ ఆవు తొలి స్థానంలో నిలిచింది. డీఎఫ్‌ఐ ఇప్పటికి ఐదుసార్లు పోటీలు నిర్వహించింది. ఒక్కసారి మినహా ప్రతిసారి మా ఆవు విజేతగా నిలిచింది’’ అని సునీల్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –