Politics

భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ పై సర్కార్ ఫోకస్

భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ పై సర్కార్ ఫోకస్

భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌పై ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ అధ్యక్షతన జరిగిన భేటీలో కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, విశ్రాంత ఐఏఎస్‌ రేమండ్‌ పీటర్‌, భూ చట్టాల నిపుణుడు సునీల్‌, విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.మధుసూదన్‌, సీఎంఆర్‌వో ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కేంద్రంగా పనిచేయాలని, సమస్యలపై అధ్యయనం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించాలని కమిటీ నిర్ణయించింది. కోదండరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌లో తప్పుల వల్ల అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటన్నింటిపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు సూచిస్తామన్నారు. తుది నివేదికకు ఎంత సమయమైనా.. దశలవారీగా సమస్యల పరిష్కారానికి మధ్యంతర నివేదికలు ఇస్తామని కమిటీ సభ్యుడు సునీల్‌ కుమార్‌ తెలిపారు. కమిటీ రెండో సమావేశం ఈనెల 17న జరుగుతుందని మరో సభ్యుడు లచ్చిరెడ్డి వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z