చిత్రం: గుంటూరు కారం; నటీనటులు: మహేశ్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్, జయరాం, రావు రమేశ్, ఈశ్వరిరావు, మురళీశర్మ, సునీల్ తదితరులు; సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస; ఎడిటింగ్: నవీన్ నూలి; నిర్మాత: ఎస్.రాధాకృష్ణ; ప్రొడక్షన్ కంపెనీ: హారిక & హాసిని క్రియేషన్స్; రచన, దర్శకత్వం: త్రివిక్రమ్; విడుదల తేదీ: 12-01-2024
సంక్రాంతి పండుగ… అందులోనూ ఓ అగ్ర హీరో – అగ్ర దర్శకుడి కలయికలో సినిమా అంటే ఆ హంగామానే వేరుగా ఉంటుంది. ‘గుంటూరు కారం’ విషయంలో అదే జరిగింది. చాలా విరామం తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ కలిసి చేసిన సినిమా ఇది. అసలు సిసలు సంక్రాంతి సందడి ఆరంభానికి సంకేతంలా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది?రమణగా మహేశ్ (Mahesh Babu) మాస్ అవతార్ మెప్పించిందా?(Guntur Kaaram Review) శ్రీలీల (Sreela) అందాలతో అలరించిందా?
కథేంటంటే: వైరా వసుంధర (రమ్యకృష్ణ), రాయల్ సత్యం (జయరామ్) కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ (మహేశ్‌బాబు). చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ విడిపోవడంతో రమణ గుంటూరులో తన మేనత్త బుజ్జి (ఈశ్వరిరావు) దగ్గర పెరుగుతాడు. వసుంధర మరో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయ శాఖ మంత్రి అవుతుంది. ఆమె తండ్రి వైరా వెంకటస్వామి (ప్రకాశ్‌రాజ్) అన్నీ తానై రాజకీయ చక్రం తిప్పుతుంటాడు. వసుంధర రాజకీయ జీవితానికి ఆమె మొదటి పెళ్లి, మొదటి కొడుకు అడ్డంకిగా మారకూడదని భావించిన వెంకటస్వామి… రమణతో ఓ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. వసుంధరకి పుట్టిన రెండో కొడుకుని ఆమె వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాడు. (Guntur Kaaram Review) తల్లిని ఎంతో ప్రేమించే రమణ… ఆ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టాడా?ఇంతకీ అందులో ఏముంది?తన తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? కన్న కొడుకుని వసుంధర ఎందుకు వదిలిపెట్టింది? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే: త్రివిక్రమ్ (Trivikram) తీసిన కొన్ని సినిమాల కథా నేపథ్యం, వాటిల్లోని పాత్రలు ఇంచుమించు ఒకేలా అనిపించినా… ఆయన ఎక్కడ అవసరమో అక్కడ కథపై పూర్తి పట్టుని ప్రదర్శిస్తూ బలమైన భావోద్వేగాలు, పదునైన మాటలతో మేజిక్ చేస్తుంటారు. అవే పాత్రలైనా వాటికి ఓ కొత్త రకమైన స్టైల్‌ని రంగరించి రక్తి కట్టిస్తుంటారు. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) విషయంలోనూ అదే జరిగింది. కానీ, ఈసారి ఆయన మేజిక్ ఏ దశలోనూ పునరావృతం కాలేదు. తల్లి కొడుకుల బంధం ప్రధానంగా సాగే ఈ కథ ఆదిలోనే తేలిపోయింది. (Guntur Kaaram Review) తెలిసిన కథే అయినా కొత్తగా చెప్పడంలో ఆరితేరిన త్రివిక్రమ్ ఈసారి బలహీనమైన రచనతో నిరాశపరిచాడు. పాతికేళ్లపాటు తల్లికి దూరంగా పెరిగిన కొడుకు, సంతకం చేస్తే తెగిపోయే ఆ బంధంతో ఈ కథ ముడిపడి ఉంటుంది. ఆ విషయం తొలి సన్నివేశాల్లోనే చెప్పేసిన దర్శకుడు… ఆ తర్వాత సినిమాని కాలక్షేప సన్నివేశాలతో నడిపించేసినట్టే ఉంటుంది. చాలా పాత్రలకి, సన్నివేశాలకీ కథతో ఏమాత్రం సంబంధం ఉండదు. తల్లి తన కొడుకుని ఎందుకు వదిలిపెట్టిందనే విషయం, తల్లికి దూరమైన కొడుకు పడిన వేదన, ఆ నేపథ్యంలోని సంఘర్షణ ఈ సినిమాకి కీలకం. కానీ, ఇందులో ఆ సంఘర్షణపైనే దర్శకుడు పట్టు ప్రదర్శించలేకపోయాడు.
గుంటూరు నుంచి హీరో హైదరాబాద్‌కి రావడం వెళ్లిపోవడమే పని అన్నట్టుగా ప్రథమార్ధం సాగుతుంది. మధ్యలో కొన్ని ఫైట్లు, శ్రీలీల, వెన్నెల కిశోర్‌తో కలిసి చేసే హీరో చేసే హంగామా తప్ప మరేదీ ఉండదు. హీరోతో సంతకం కోసం మురళీశర్మ తన కూతురుని రంగంలోకి దించడం, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఏమాత్రం మెప్పించవు. అవి త్రివిక్రమ్ స్థాయికి తగ్గ పాత్రలు, సన్నివేశాలు ఏమాత్రం కావు. (Guntur Kaaram Review) ద్వితీయార్ధంలో ప్రకాశ్‌రాజ్ పాత్ర చేసే రాజకీయం, ఆయన ఎత్తుగడలు ఓ పట్టాన అర్థం కావు. పైపెచ్చు కొడుకుతో ఓ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకున్నంత మాత్రాన రాజకీయంగా కానీ, వారసత్వం విషయాల్లో కానీ ఎలాంటి సమస్యలు రావా? అసలైన ఆ విషయంలోనే సహజత్వం లోపించినట్టు అనిపిస్తుంది. మాటలతో మేజిక్ చేసే త్రివిక్రమ్ ఇందులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ‘అన్నం వద్దనుకున్నవాడు రోజంతా పస్తులుంటాడు, అమ్మని వద్దనుకున్నవాడు జీవితాంతం ఏడుస్తాడు’. ‘అమ్మ తన బిడ్డలకి ఏం చేసిందని అడగకూడదు’, ‘తద్దినం జన్మదినం రెండూ దినాలే’ తరహా సంభాషణలు వినిపిస్తాయి. మాస్ పాత్రలో మహేశ్‌బాబు చేసే హంగామా, ఆయన ఎనర్జీ, మాస్ పాటలు, విరామ సన్నివేశాలు, పతాక సన్నివేశాల్లో కాసిన్ని భావోద్వేగాలు ఇవే ఈ సినిమాకు బలం.
ఎవరెలా చేశారంటే: మహేశ్‌బాబు (Mahesh babu) పాత్ర ఆయన నటనే ఈ సినిమాకి హైలైట్. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఇలా డ్యాన్స్ చేయలేదనే డైలాగ్‌కి తగ్గట్టే ఆయన ఇందులో అదరగొట్టాడు. భావోద్వేగాల్నీ పండించాడు. శ్రీలీల మరోసారి డ్యాన్స్‌కే పరిమితమైంది. ప్రభుదేవా డూప్‌లా ఉంది అని హీరో అన్నట్టుగానే ఆమె అదరగొట్టింది. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాటలో ఆమె, మహేశ్ కలిసి చేసిన హంగామా కల్ట్ మాస్ అనాల్సిందే. (Guntur Kaaram Review in telugu) మీనాక్షి చౌదరి పాత్ర పరిమితమే. రమ్యకృష్ణ పాత్ర, ఆమె నటన హుందాగా ఉంది. ఈశ్వరీరావు పాత్ర, ఆమె డైలాగులు కాస్త శ్రుతిమించినట్టు అనిపిస్తాయి. ప్రకాశ్‌రాజ్, వెన్నెల కిశోర్ పాత్రల్లో కొత్తదనమేమీ లేదు. జగపతిబాబు, రావు రమేశ్, మురళీశర్మ, సునీల్… ఇలా చాలా మంది నటులు కనిపిస్తారు కానీ, ఏ పాత్రలోనూ బలం కనిపించదు. (Trivikram) రచనలో విషయంలో దర్శకుడు తప్ప సాంకేతికంగా విభాగాలు లోటేమీ చేయలేదు. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టే ఉంది.
బలాలు
+ మహేశ్ పాత్ర, నటన
+ పాటలు… శ్రీలీల డ్యాన్సులు
బలహీనతలు
– కథ, కథనం
– కొరవడిన భావోద్వేగాలు, రచనలో కనపడని త్రివిక్రమ్ మార్క్
చివరిగా..: గుంటూరు కారం… ఘాటున్నా రుచి లేదు (Guntur Kaaram Review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
👉 – Please join our whatsapp channel here –