* జియో యూజర్లకు గుడ్‌న్యూస్
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) ఇటీవల అదనపు డేటా ఆఫర్లను తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రెండు ప్రీపెయిడ్ ప్లాన్ల(Jio Prepaid Plan)కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.జియో అందిస్తున్న రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జితో 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్‌కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. రోజుకు 3 జీబీ చొప్పున మొత్తం 84 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్‌ను ఎంచుకునేవారికి తాజా ఆఫర్‌లో భాగంగా అదనంగా 6జీబీ డేటా పొందొచ్చు.జియో మరో ప్లాన్ రూ.219 రీఛార్జితో 14 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్‌కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. తాజా ఆఫర్‌లో భాగంగా ఈ ప్లాన్‌తో 2జీబీ డేటా అదనంగా పొందొచ్చు.
* గూగుల్‌లో మరోసారి లేఆఫ్స్
2022 చివర్లో ప్రారంభమైన టెక్ లేఆఫ్స్ 2024లో కొనసాగుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం వల్ల వేలాది మంది ఉద్యోగులను ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు తొలగించాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్ ప్రపంచంలోకి శరవేగంగా దూసుకురావడం కూడా ఉద్యోగుల పాలిట శాపంగా మారింది.ఇప్పటికు గూగుల్ సంస్థ పలుమార్లు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. తాజాగా వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనుంది. గూగుల్ తన వాయిస్-యాక్టివేటెడ్ గూగుల్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్ టీమ్‌ల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు నిర్ణయించింది. దీనిని గూగుల్ ప్రతినిధి బుధవారం ధృవీకరించారు. ఈ నిర్ణయం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెజెన్స్ సాంకేతికతను సమగ్రపరచడం ద్వారా గూగుల్ అసిస్టెంట్‌ను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గూగుల్ చెబుతోంది. గూగుల్ అసిస్టెంట్‌ని మరింత మెరుగుపరిచేందుకు తన AI చాట్‌బాట్ బార్డ్‌ని ఉపయోగించాలని యోగిస్తోంది. ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్ యూజర్లకు వాయిస్‌కి మించి సేవలందిస్తుందని, యూజర్లకు ఏం కావాలో అర్థం చేసుకుని పనులను నిర్వహించగలదని భావిస్తున్నట్లు సంస్థ చెబుతోంది. 2023 జనవరిలో 12,000 మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది. ఒక్క గూగుల్ మాత్రమే కాదు అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి సంస్థలు కూడా వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి.
* మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ప్రో భారత మార్కెట్‌లో విడుదల
ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) నవీకరించిన ఎక్స్‌యూవీ 400 (XUV400) ఎలక్ట్రిక్ వాహనాన్ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎక్స్‌యూవీ 400 ప్రో (XUV400 Pro) పేరుతో మూడు వేరియంట్లలో ఈ కారును తీసుకొచ్చింది.ఇందులో ఏసీ ప్రో వేరియంట్ (34.5kWh బ్యాటరీ, 3.3kW ఏసీ ఛార్జర్) ధర రూ.15.49 లక్షలు, ఈఎల్ ప్రో (34.5kWh బ్యాటరీ, 7.2 kW ఏసీ ఛార్జర్) మోడల్ ధర రూ.16.74 లక్షలు కాగా, ఈఎల్ ప్రో వేరియంట్ (39.4kWh బ్యాటరీ, 7.2 kW ఏసీ ఛార్జర్) ధర రూ. 17.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. రేపటి నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయని, రూ.21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపింది. మే 31 తర్వాత వాహన ధరల్లో మార్పు ఉంటుందని పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి కారు డెలివరీలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది.ఫీచర్లు ఇవే..మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ప్రో ఈసీ ప్రో వేరియంట్‌లో 34.5 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. 3.7 kW ఏసీ ఛార్జర్‌తో రానుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 375 km ప్రయాణించవచ్చు. ఈఎల్ ప్రో వేరియంట్ లో 34.5 kWh, 39.4 kWh.. రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఇచ్చారు. ఈ రెండు వేరియంట్లలోని ఎలక్ట్రిక్ మోటార్ 150hp శక్తిని, 310 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 150 kph టాప్ స్పీడ్‌తో.. కేవలం 8.3 సెకన్లలో 0-100 km వేగాన్ని అందుకుంటుంది. 7.2 kW ఏసీ ఛార్జర్‌తో వస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 456 km ప్రయాణించొచ్చు. సన్‌రూఫ్‌తో వస్తోన్న ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు ఇస్తున్నారు.
* ఏడాది వ్యాలిడిటీతో Vodafone Idea అందిస్తున్న ప్లాన్లు
దేశీయ మూడో టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా తన వినియోగదారులను పెంచుకోవడానికి కొత్త కొత్త ప్లాన్లను తీసుకొస్తుంది. మిగతా సంస్థలతో పోలిస్తే తక్కువ ధరల్లో రీచార్జ్ ప్లాన్లను అందిస్తుంది. ముఖ్యంగా ఏడాది వ్యాలిడిటితో బడ్జెట్ ధరల్లో కొన్ని ప్లాన్లను తన వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచింది. ఏ ఏ ధరల్లో ప్రస్తుతం అవి లభిస్తున్నాయో ఒకసారి చూద్దాం..రూ. 1799 ప్లాన్: దీనిలో ఏడాది పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. డేటా విషయానికి వస్తే 24 GB వస్తుంది. రోజుకు 100 SMS లు కూడా ఉంటాయి. అలాగే, Vi Movies, TV యాప్‌కు యాక్సెస్ ఉంటుంది. ఇంటర్నెట్ అవసరం లేని వినియోగదారులు ఈ ప్లాన్‌ను ఎంచుకోవడం ఉత్తమం.రూ. 2899 ప్లాన్: దీనిలో ఏడాది పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 1.5 GB డేటా, 100 SMS లు లభిస్తాయి. ఇంకా వీకెండ్ డేటా రోల్‌ఓవర్ సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా ఆ వారంలో వాడకుండా మిగిలిపోయిన డేటాను వీకెండ్‌లో వాడుకునే సదుపాయం ఉంటుంది. అదనంగా రాత్రి అన్‌లిమిటెడ్ డేటా కూడా లభిస్తుంది. Vi సినిమాలు, టీవీకి యాక్సెస్ కూడా ఉంది.రూ. 3099 ప్లాన్: డేటా ఎక్కువ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. ఏడాది పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజు 2GB డేటా, 100SMSలు వీకెండ్ డేటా రోల్‌ఓవర్, రాత్రి అన్‌లిమిటెడ్ డేటా, Vi సినిమాలు, టీవీతో పాటు, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.రూ. 3199 ప్లాన్: దీనిలో రోజుకు 2 GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజు 100 sms, వీకెండ్ డేటా రోల్‌ఓవర్, రాత్రి అన్‌లిమిటెడ్ డేటా, Vi సినిమాలు, టీవీతో పాటు, అమెజాన్ ప్రైమ్ వీడియో ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది.
* లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు (Stock market) గురువారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల అంశాలతో ఇవాళ ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 71,991.97 గరిష్ఠాన్ని తాకింది. చివరికి 63.47 పాయింట్ల లాభంతో 71,721 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 28.50 పాయింట్లు లాభపడి 21,647.20 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.03గా ఉంది.హీరోమోటో కార్ప్, బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, భారత్ పెట్రోలియం షేర్లు లాభపడగా.. పాలీక్యాబ్ ఇండియా, ఆస్ట్రాజెనికా ఫార్మా, ఫొయెనిక్స్ మిల్స్, కేఈఐ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాలబాటపట్టాయి. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైన ఐరోపా మార్కెట్లలో… డీఎఎక్స్, సీఏసీ సహా ప్రధాన సూచీలన్నీ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. బిట్‌కాయిన్ ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ల)కు అమెరికా అనుమతిచ్చిన నేపథ్యంలో కాయిన్ విలువ 1.32 శాతం లాభపడి 46,346 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
👉 – Please join our whatsapp channel here –