ప్రపంచంలోనే 2024కిగానూ ఆరు దేశాల పాస్‌పోర్టులు (Passport) అత్యంత శక్తిమంతమైనవిగా నిలిచాయి. వీటిలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ ఉన్నాయి. మంగళవారం విడుదలైన ‘హెన్లీ పాస్‌పోర్టు సూచీ’ నివేదికలో (Henley Passport Index) ఇవి తొలి స్థానంలో నిలిచాయి. 227 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 80వ స్థానం దక్కించుకొంది.
తొలి స్థానంలో నిలిచిన ఆరు దేశాల పాస్‌పోర్టులతో ఏకంగా 194 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించొచ్చు. గత ఐదేళ్లుగా ఈ సూచీలో సింగపూర్, జపాన్ తొలిస్థానంలో నిలుస్తున్నాయి. ఈసారి అదనంగా మరో నాలుగు దేశాలు వాటి సరసన చేరాయి. రెండో స్థానంలో ఉన్న దక్షిణ కొరియా, ఫిన్లాండ్, స్వీడన్ దేశాల పాస్ట్పోర్టులతో 193 దేశాలకు సౌకర్యవంతంగా వెళ్లొచ్చు. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ పాస్‌పోర్టులు మూడో స్థానంలో ఉన్నాయి. వీటితో 192 దేశాలకు వెళ్లేందుకు ముందస్తు వీసా అవసరంలేదు. 191 దేశాలకు ప్రయాణించే సౌకర్యం ఉన్న యూకే పాస్‌పోర్టు నాలుగో స్థానం దక్కించుకుంది.
తాజా సూచీలో 80వ స్థానంలో ఉన్న భారత పాస్పోర్టుతో (Indian Passport) 62 దేశాలకు ప్రయాణించొచ్చు. గత ఏడాది 59 దేశాలు మాత్రమే ముందస్తు వీసా లేకుండా మన పాస్పోర్టుతో ప్రయాణించేందుకు అనుమతించాయి. దీంతో 2023లో మన దేశం ఈ జాబితాలో 85వ స్థానంలో నిలిచింది. ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ ప్రకారం 2006లో భారత్ 71వ స్థానంలో ఉండేది. ఈసారి జాబితాలో అఫ్గానిస్థాన్ చివరి స్థానం(104)లో నిలిచింది. ఆ దేశ పాస్పోర్టుతో 28 దేశాలు మాత్రమే ఈ రకంగా అనుమతిస్తున్నాయి. దీని కంటే మూడు స్థానాలు మెరుగ్గా 101వ ర్యాంక్‌లో పాక్ పాస్‌పోర్టు ఉంది.
దశాబ్ద కాలంలో యూఏఈ పాస్‌పోర్టు 55 నుంచి 11వ స్థానానికి ఎగబాకింది. ఉక్రెయిన్, చైనా 21 స్థానాలు మెరుగుపర్చుకున్నాయి. చైనా తాజాగా 62వ, ఉక్రెయిన్ పాస్‌పోర్టు 32వ స్థానంలో నిలిచింది. రష్యా పదేళ్లలో 24 స్థానాలు ఎగబాకి ఈసారి 51వ ర్యాంక్‌కు చేరింది. ఆ దేశ పాస్పోర్టుతో 119 దేశాలకు ముందస్తు వీసా లేకుండా వెళ్లొచ్చు.
👉 – Please join our whatsapp channel here –