DailyDose

3 కేటగిరీలుగా వాటి ఏర్పాటుకు ఏఐసీటీఈ అనుమతి

3 కేటగిరీలుగా వాటి ఏర్పాటుకు ఏఐసీటీఈ అనుమతి

ఒక అధ్యాపకుడు ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో మాత్రమే పాఠాలు బోధించాలన్నది ఇప్పటివరకు ఉన్న నిబంధన. కొత్తగా ఆఫ్‌ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే కళాశాలలు మాత్రం వారితో రెండుచోట్ల పాఠాలు చెప్పించవచ్చు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) కళాశాలలకు ఈ వెసులుబాటు కల్పించింది. ఉత్తమ పనితీరు కనబరిచే ఇంజినీరింగ్‌ కళాశాలలకు అఫిలియేషన్‌ విశ్వవిద్యాలయం పరిధిలో ఆఫ్‌ క్యాంపస్‌లు పెట్టుకోవచ్చని ఏఐసీటీఈ నూతన విధాన నిర్ణయాన్ని తీసుకొచ్చింది. ఆ ప్రకారం స్వయంప్రతిపత్తి హోదా ఉన్న, న్యాక్‌ ఏ గ్రేడ్‌ పొందిన కళాశాలలు వచ్చే విద్యాసంవత్సరం(2024-25) నుంచి ఆఫ్‌ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో కూడా కొన్ని కళాశాలలు ఆఫ్‌ క్యాంపస్‌ల ఏర్పాటుకు సమాయత్తమవుతున్నాయని ఓ కళాశాల యజమాని తెలిపారు. ఏఐసీటీఈ అనుమతుల నిబంధనావళిలో ఎన్ని ఆఫ్‌ క్యాంపస్‌లు అన్నది స్పష్టం చేయలేదు. ప్రధాన కళాశాల ఏ వర్సిటీకి అనుబంధంగా ఉందో.. దాని పరిధిలో మాత్రమే వాటిని ఏర్పాటు చేసుకోవాలి.

ఉదాహరణకు జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఆఫ్‌ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. అదే ఓయూకు అనుబంధంగా ఉంటే కేవలం హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలోనే ప్రారంభించుకోవాలి. ఆఫ్‌ క్యాంపస్‌లను ఏఐసీటీఈ మూడు కేటగిరీలుగా విభజించింది. ప్రధాన క్యాంపస్‌కు 5 కి.మీ.లోపు దూరంలో, 75 కి.మీలోపు, ఆపైదూరంలో అని ఇవ్వనున్నారు. మొదటి కేటగిరీ కింద అధ్యాపకులతో పాటు ఆయా సదుపాయాలైన ప్రయోగశాలలు, క్రీడామైదానాలు లాంటివి రెండు క్యాంపస్‌లు వినియోగించుకోవచ్చు. అంటే ఒక అధ్యాపకుడు ఎక్కడ అవసరముంటే అక్కడ పాఠాలు బోధిస్తారు. ఇక రెండో కేటగిరీలో మాత్రం అధ్యాపకులను ఆఫ్‌ క్యాంపస్‌కు పంపొచ్చు. కాకపోతే ఒకేరోజు రెండింటిలో బోధించడానికి వీల్లేదు. ఒకరోజు ప్రధాన క్యాంపస్‌, మరుసటిరోజు ఆఫ్‌ క్యాంపస్‌లో పాఠాలు చెప్పొచ్చు. ఇక మూడో కేటగిరీ కింద అధ్యాపకులను, వసతులను పంచుకోవడానికి వీల్లేదు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z