* సొంత లీడర్లకు కేటీఆర్ వార్నింగ్
సొంత పార్టీ నేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను ఓడించి ప్రజలు తప్పు చేశారని అక్కడక్కడా పార్టీ శ్రేణులు ప్రజలతో సంభాషిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. అలా మాట్లాడటం, ప్రజా తీర్పును గౌరవించకపోవడం కరెక్ట్ కాదని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకుంటే గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు బంపర్ మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని ఏ బీఆర్ఎస్ కార్యకర్త, నాయకుడు కూడా మర్చిపోవద్దని చెప్పారు.బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించలేదని.. కేవలం కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇచ్చారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు ఫలితాల్లో భిన్నత్వాన్ని చూయించారని అన్నారు. ఎందుకిలా జరిగిందో విశ్లేషించుకోవాలని అన్నారు. కొంతమంది కాంగ్రెస్‌కు ఓటు వేసి.. కేసీఆర్ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని అడుగుతున్న విషయం ఆలోచింపచేసిందని తెలిపారు. కచ్చితంగా గెలుస్తామనుకున్న జిల్లాల్లో భిన్న ఫలితాలు రావడం నిరాశపరిచిందని ఆవేదన చెందారు. గెలుస్తామనుకున్న 14 నియోజకవర్గాలు కూడా గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా వుండేదని అభిప్రాయపడ్డారు.
* ఢిల్లీకి చేరుకున్న సీఎం
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం నాడు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. కాసేపటి క్రితమే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీని ( Sonia Gandhi ) ఆమె నివాసంలో కలవనున్నట్లు తెలుస్తోంది. సోనియాగాంధీ, ఏఐసీసీ అగ్ర నేతలతో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియాగాంధీని పోటీ చేయాలని రేవంత్‌రెడ్డి అడగనున్నట్లు తెలుస్తోంది.కాగా.. రేపు( శనివారం ) పలువురు కేంద్రమంత్రులను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి ఉదయం మణిపూర్‌కి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. ఈనెల 14వ తేదీన ఏఐసీసీ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేపట్టే భారత్ న్యాయ యాత్రలో పాల్గొనడానికి సీఎం రేవంత్‌రెడ్డి మణిపూర్ వెళ్లనున్నారు. న్యాయ యాత్రలో పాల్గొన్న అనంతరం అదే రోజు ఢిల్లీకి చేరుకొని దావోస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం.
* లోకేష్ చంద్రబాబుపై కేశినేని కామెంట్స్
వచ్చే ఎన్నికల్లో టీడీపీ 50 స్థానాల్లో కూడా గెలిచి పరిస్థితి లేదు అని తన సర్వేల్లో తేలిందన్నారు ఎంపీ కేశినేని నాని. నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడమే చంద్రబాబు లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్‌ను కూడా చంద్రబాబు మోసం చేస్తారని నాని తెలిపారు.కాగా, ఎంపీ కేశినేని నాని విజయవాడలోని ఆటోనగర్‌లో ఎంపీ నిధులతో నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. ‘నాకు విజయవాడ అంటే పిచ్చి.. ఆటోనగర్ అంటే ప్రాణం. నేను ఆటోనగర్ తీసేస్తున్నాని ప్రచారం చేశారు. బాండ్ లేకుండా రెండు ఎకరాలు నేను రాసిచ్చాను. దాని విలువ రూ. 100కోట్లు. నిస్వార్దంగా చేసిన పని ఇప్పుడు ఆటోనగర్‌కి ఉపయోగపడుతోంది. దేశంలోనే ఎక్కువగా కార్మికులు పనిచేసే ప్రాంతం ఆటోనగర్. కార్మికుల ఆరోగ్యానికే పెద్దపీట. ఆటోనగర్ అభివృద్ధికి కేశినేని కుటుంబం కట్టుబడి ఉంది.నన్ను ఎంపీగా ఎన్నుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి జగన్‌కు గిఫ్ట్ ఇస్తాను. టీడీపీ నన్ను పార్టీ నుంచి గెంటేసింది. లోకేష్‌ను సీఎం చేయడమే చంద్రబాబు లక్ష్యం. లోకేష్‌ను సీఎం చేయడం కోసం రేపు పవన్‌ను కూడా చంద్రబాబు మోసగిస్తారు. విజయవాడను స్మశానం చేశాడు చంద్రబాబు. విజయవాడపై చంద్రబాబుకు చిన్నచూపు. 33వేల ఏకరాలతో రైతులను మోసం చేశారు. 30 ఏళ్లు అయినా రాజధాని నిర్మాణం పూర్తి అవ్వదు అని నేను నాడే చెప్పాను. భూ మాఫియాకి టీడీపీ నేతలు తెర లేపారు. రాజధాని విషయంలో చంద్రబాబు స్వార్థం పూరితంగా వ్యవహరించారు.మంచి చేసేవాళ్లు.. మంచివాళ్ళు కొందరే ఉంటారు. సమర్థత కూడా కావాలి. సీఎం నుండి నిధులు తెచ్చే సమర్థత అవినాష్‌ది. తూర్పు నియోజకవర్గానికి కేశినేని, దేవినేని రక్షణగా ఉంటాం. మా కాంబినేషన్ అంటే డబుల్ రిటైనింగ్ వాల్. మా ఇద్దరి వల్ల రాబోయే రోజుల్లో అద్భుత ఫలితాలు వస్తాయి. ఎందుకు చెబుతున్నానో విజయవాడ ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు.
* తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం
తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. ఘాట్‌రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో అస్సాంకు చెందిన ఇద్దరు తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులోని మోకాళ్ల పర్వతం వద్ద వారి వ్యక్తిగత డ్రోన్‌తో చిత్రీకరిస్తుండగా.. ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.భద్రతా కారణాల దృష్ట్యా తిరుమలలో ఎటువంటి డ్రోన్లు ఉపయోగించేందుకు అనుమతి లేదు. భక్తుల వాహనాలను అలిపిరి చెక్‌పోస్టు వద్ద క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తారు. కానీ, అధికారుల కళ్లు గప్పి ఇద్దరు భక్తులు వారితో పాటు డ్రోన్ తీసుకురావడం, మోకాళ్ల పర్వతం ప్రాంతంలో దాన్ని వినియోగించడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన తితిదే విజిలెన్స్ అధికారులు అస్సాం వాసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
* 25 నుంచి ప్రజల్లోకి జగన్
సీఎం జగన్ మోమన్ రెడ్డి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లనున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 25 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటనను ప్రారంభించనున్నారు. రోజుకు రెండు జిల్లాల చొప్పున పర్యటించానున్నారు. ఈ పర్యటనలో తమ ప్రభుత్వం ఏం చేసిందనేది, వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే ఏం చేస్తామనే విషయాలను వివరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకునేలా జిల్లాల నాయకులకు ఇప్పటికే సమాచారం పంపారు. అటు పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం వైనాట్ 175 అంటున్నారు. ఇందులో భాగంగా చాలా నియోజకవర్గాల్లో ఇంచార్జులను మార్చారు. 60 నియోజకవర్గాలకు పైగా కొత్త ఇంచార్జులను నియమించారు. అలాగే ఆరు లోక్ సభ నియోజకవర్గాలకు సైతం ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన నియోజకవర్గాలపైనా ఆయన దృష్టి పెట్టారు. ఇప్పటికే మూడు లిస్టులను విడుదల చేశారు. పలువురికి సీట్లు నిరాకరించారు. తాజాగా మరో లిస్టుపైనా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత నాలుగో జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే నాలుగో లిస్టులో ఎవరు పేరు ఉంటుందో..ఎవరి పేరు ఉండదోనని మిగిలిన ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. ఏం జరుగుతుందో చూడాలి.
* అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా?
తనకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదని వైకాపా (YSRCP) ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) అన్నారు. పెనమలూరు సమన్వయకర్తగా మంత్రి జోగి రమేశ్‌ను అధిష్ఠానం నియమించింది. ఈ నేపథ్యంలో పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీపై విమర్శలు చేశారు.‘‘ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా? వైకాపాలో బీసీలకు అగ్రతాంబూలం.. నేతి బీరకాయలో నెయ్యి చందమే. గన్నవరంలో పార్టీ గెలిచే పరిస్థితి లేదని నన్ను వెళ్లమన్నారు. బీసీ నేతను కాబట్టి అక్కడ ఓడినా పర్లేదని భావించారు. నేను వెళ్లేందుకు విభేదించడం పార్టీకి నచ్చలేదు. బలహీనవర్గాలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని గతంలో చెప్పా. అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. బీసీ, ఎస్సీలు ఎవరి కాళ్లపై వారు నిలబడాలనుకుంటారు. మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం చంపుకోరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.మరోవైపు తెదేపాలో పార్థసారథి చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు ఆయనతో చర్చించారు. వారు తెదేపాలోకి ఆహ్వానించగా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా అధినేత చంద్రబాబు ‘రా.. కదలి రా’ బహిరంగ సభ జరగనుంది. ఆ వేదిక మీదే పార్థసారథి తెదేపాలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం.
* స్వయంగా జోడో యాత్ర పోస్టర్ అతికించుకున్న మంత్రి
“న్యాయమైన హక్కును సాధించే వరకు” పోరాటం చేస్తామంటూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన రెండో విడత భారత్ జోడో యాత్ర ఈ నెల 14న మణిపూర్ లో ప్రారంభమై ముంబై వరకు సాగుతుందని రోడ్లు భవనాల శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.కాగా.. ఈరోజు స్వయంగా రాహుల్ గాంధీ జోడో యాత్ర పోస్టర్ ను తన వాహనానికి అతికించిన మంత్రి.. రాహుల్ గాంధీ అనుచరునిగా, కాంగ్రెస్ పార్టీ జీవితకాల కార్యకర్తగా.. భారత్ జోడో యాత్రకు తన సంఘీభావాన్ని తెలుపుతానన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక సందేశం అందించేందుకు యాత్ర పోస్టర్ ను తానే స్వయంగా తన వాహనానికి అతికించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా భారత్ జోడో యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
* టీఎస్‌ఎండీసీ వైస్ ఛైర్మన్ మల్సూర్‌పై బదిలీ వేటు
తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (TSMDC) లిమిటెడ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జీ మల్సూర్ (G. Malsur) ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది.అదేవిధంగా తెలంగాణ ఇండస్ట్రీస్ & కామర్స్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బెన్హూర్ మహేశ్ దత్ ఎక్కాకు తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (TSMDC) లిమిటెడ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మహేశ్ దత్ ఆ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పేరు మీదుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి మీడియాకు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –