Agriculture

వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకేనా?

వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకేనా?

రాష్ట్రంలోని వ్యవసాయ మోటర్లకు జియో ట్యాగింగ్‌ చేయడం మొదలయ్యింది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఈ, సబ్‌ ఇంజినీర్లతోపాటు లైన్‌మెన్‌, జూనియర్‌ లైన్‌మెన్‌ స్థాయి ఉద్యోగులందరూ ఇందులో పాల్గొనాలని, ట్యాగింగ్‌ మొత్తం ఫిబ్రవరి 28లోగా పూర్తిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయని సమాచారం. పై నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఎస్‌ఈ, డీఈల పరిధిలో సమావేశాలు ఏర్పాటుచేసి జియో ట్యాగింగ్‌ ఎలా చేయాలనేది వివరిస్తున్నారు. ప్రతి వ్యవసాయ మోటర్‌ దగ్గరికి వెళ్లి సిబ్బంది సెల్‌ఫోన్‌లో ఉన్న యాప్‌లో మీటర్‌ వివరాలను నమోదుచేసి జియో ట్యాగ్‌ చేయాలని తెలుపుతున్నారు. తద్వారా అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారం అక్కడ ఒక వ్యవసాయ మోటర్‌ ఉందనేది యాప్‌లో నిక్షిప్తమవుతుందని చెప్తున్నట్టు సమాచారం. దీనివల్ల ట్రాన్స్‌ఫార్మర్‌, సబ్‌స్టేషన్‌, డివిజన్‌ పరిధిలో ఉన్న అన్ని వ్యవసాయ మోటర్ల మ్యాపింగ్‌ తయారవుతుంది. మొబైల్‌ యాప్‌లో మ్యాపింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సర్వీసెస్‌ అనే క్యాటగిరీలోనే ఈ జియో ట్యాగింగ్‌ చేయాలని అధికారులు సిబ్బందికి వివరిస్తున్నారు. రైతులకు కూడా జియో ట్యాగింగ్‌ గురించి వివరించి సిబ్బందికి సహకరించేలా చూడాలని ఆదేశిస్తున్నారు.

అధికారులు గప్‌చుప్‌
అకస్మాత్తుగా వ్యవసాయ మోటర్లకు జియో ట్యాగింగ్‌ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఈ మధ్య కాలంలో కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఎఫ్‌ఆర్‌బీఎంలో 0.5 శాతం అదనపు రుణాలు తీసుకోవడానికి అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో మోటర్లకు మీటర్లు పెట్టే క్రమంలో ఇలా జియో ట్యాగింగ్‌ మొదలు పెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మోటర్లకు మీటర్లు పెట్టిన తర్వాత జియో ట్యాగింగ్‌ చేసినట్టు సమాచారం. తెలంగాణలో జియో ట్యాగింగ్‌ చేసిన తర్వాత మీటర్లు పెడుతారని ప్రచారం జరుగుతున్నది. జియో ట్యాగింగ్‌ ఆదేశాలు కేంద్రం నుంచి వచ్చాయా? లేక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా? అనేదానిపై విద్యుత్తు శాఖ అధికారులెవరూ నోరు మెదపడం లేదు.

జియో ట్యాగింగ్‌ అంటే?

ప్రతి వ్యవసాయ మోటర్‌ కనెక్షన్‌ను ఒక యాప్‌లో నమోదుచేయటం ద్వారా జియో ట్యాగింగ్‌ చేస్తారు. దీనివల్ల అక్షాంశాలు, రేఖాంశాలతో సదరు వ్యవసాయ మోటర్‌ ఎక్కడ ఉన్నదో గుర్తించవచ్చు. ఇలా ఒక సబ్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న అన్ని వ్యవసాయ మోటర్లను నమోదు చేస్తే.. అది మ్యాపింగ్‌ అవుతుంది. ఇలా సబ్‌డివిజన్‌, జిల్లా, రాష్ట్రం మొత్తం మ్యాపింగ్‌ చేయవచ్చు. దీనివల్ల సబ్‌స్టేషన్‌ పరిధిలో ఉండే మోటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎన్ని ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి? ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ కింద ఎన్ని మోటర్లు ఉన్నాయి? ఎక్కడ లోడ్‌ ఎక్కువ ఉన్నది? అనే సమాచారమంతా తెలుస్తుంది. అలాగే విద్యుత్తు వినియోగం, సాంకేతిక ఇబ్బందులు కూడా తెలుస్తాయి. మోటర్లతోపాటు ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, ఫీడర్లు ఇలా అన్నింటికీ ట్యాగింగ్‌ చేయవచ్చు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z