Agriculture

మిరప తోటను పరిశీలించిన అధికారులు

మిరప తోటను పరిశీలించిన అధికారులు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు వరంగల్‌, ఖమ్మం తదితర జిల్లాల్లోని మిర్చి పంట క్షేత్రాలను అధికారుల బృందాలు గురువారం పరిశీలించాయి. ఈ సందర్భంగా పంటలకు సోకిన తెగుళ్లను పరిశీలించి, వాటి నిర్మూలనకు సూచనలు ఇచ్చారు. ‘మిర్చి పంటకు తెగుళ్ల పోటు’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన మంత్రి.. పంటల పరిశీలనకు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖల ఉన్నతాధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బృందాలు గురువారం వరంగల్‌ జిల్లాలోని దుగ్గొండి మండలం తిమ్మంపేట, నర్సంపేట మండలంలోని మాదన్నపేట, భాంజీపేట, అలంఖానిపేటల్లోని మిర్చి తోటలను పరిశీలించారు. పంటలకు సోకిన తెగుళ్లను పరిశీలించారు. నల్లతామర పురుగు వ్యాపించి తీవ్ర నష్టం వాటిల్లిందంటూ రైతులు ఈ సందర్భంగా కన్నీటిపర్యంతమయ్యారు. ఎకరానికి రూ.లక్ష మేరకు నష్టం జరిగిందని వాపోయారు. మొక్కజొన్న, పసుపు, ఇతర పంటలకు సైతం తెగుళ్లు సోకాయని చూపారు. తమకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పంట నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, చింతకాని, ముదిగొండ, వేంసూరు, తల్లాడ మండలాల్లో మిరప తోటలను శాస్త్రవేత్తలు, మార్కెటింగ్‌, ఉద్యాన, వ్యవసాయశాఖల అధికారులు పరిశీలించారు. మిరపకు ఆశించిన చీడపీడల ఉద్ధృతి, రైతులు వాడిన పురుగుమందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z