ప్రైవేటు ట్రావెల్స్‌పై నియంత్రణ లేక రవాణాశాఖ చేష్టలుడిగి చూస్తోంది. పర్వదినాల్లో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నా అధికారులు నియంత్రించలేకపోతున్నారు. ఫిట్‌నెస్, బీమా లేకపోతే.. ఇతరత్రా నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేయడం తప్ప అధిక టిక్కెట్ల ధరలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నగరం నుంచి ఊళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో నిర్ణీత టిక్కెట్ ధరలు అందుబాటులో ఉన్నాయి. ధరలను ముందే ఆర్టీసీ డిస్‌ప్లే చేస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్‌కు ఈ నిబంధనలు లేవు. దీంతో ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
ఆర్టీసీతో పోల్చితే భారీగా..
ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల ధరలతో పోల్చితే ప్రైవేటు బస్సుల్లో మూడురెట్లు అధికంగా వసూళ్లు చేస్తున్నారు. వైజాగ్, శ్రీకాకుళం, పలాస, విజయనగరంలాంటి సుదూర ప్రాంతాల రైళ్లు 3 నెలల క్రితమే నిండిపోయాయి. దీంతో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్-వైజాగ్‌కు రైలులో థర్డ్ ఏసీ రూ.1200 వరకు ఉంటే స్లీపర్ బస్సులో రూ.3500-4000 వసూలు చేస్తున్నారు. నాన్ ఏసీ బస్సులో రూ.2500-3000 మధ్య ఉన్నాయి. నలుగురున్న కుటుంబానికి బస్సులో రానుపోను రూ.20 వేలపైన ఖర్చవుతోంది. దూరప్రాంతాలకు స్లీపర్ బస్సులోనే వెళ్లాలనుకుంటారు కాబట్టి నలుగురున్న కుటుంబానికి రానుపోను రూ.30 వేలపైనే వెచ్చించాలి. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకునే వెసులుబాటున్న యాప్‌లలో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది.
సౌకర్యాలు అంతంతే..
పోనీ బస్సుల్లో సౌకర్యాలు బాగున్నాయా అంటే అవీ అంతంతమాత్రమే. పండగలొచ్చాయంటే డొక్కు బస్సులనూ తిప్పుతుంటారు. సీట్లు సక్రమంగా ఉండవు.. ప్రయాణంలో పెద్ద శబ్దాలు.. ప్రయాణికులతో దురుసు ప్రవర్తన.. ఇలాంటి ఎన్నో ఫిర్యాదులు. మధ్యలో ఎక్కడైనా బస్సాపితే మహిళా ప్రయాణికులు మరుగుదొడ్ల విషయంలో ఇబ్బంది పడుతుంటారు. రెండు రోజులుగా ఆర్టీఏ సిబ్బంది దాడులు చేసి లోపాలు గుర్తించి 117 కేసులు నమోదు చేశారు. పన్నులు, ఇతర బకాయిలు కలిపి రూ.4.17 లక్షలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –